23 June, 2026 | 1:15 AM

ఆకాశం వైపు రైతన్న చూపు!

23-06-2026 12:00 AM
  1. కానరాని చినుకు జాడ! 
  2. ముందుకు సాగని ఖరీఫ్ పనులు..
  3. మెదక్ జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు.. 
  4. ఆందోళనలో రైతులు

మెదక్, జూన్ 22 (విజయ క్రాంతి) : ‘సినుకమ్మా.. వాన సినుకమ్మా.. నేల చిన్నబోయె సూడు బతుకమ్మ’ అంటూ మళ్లీ వర్షాల కోసం మళ్లీ ఎదురు చూసే రోజులు వచ్చాయి. వానకాలం ప్రారంభమైనా.. నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా.. ఆకాశంలో మేఘాలు రోజూ దట్టంగా కమ్ముకుంటున్నా వాన జాడ మాత్రం కానరావడం లేదు.

మృగశిర కార్తెకు ముందు మూడు రోజుల పాటు అక్కడక్కడా చిరుజల్లులతో కురిసినా ఆ తర్వాత మళ్లీ కురవలేదు. అసలైన తొలకరి పలకరింపు కోసం అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విత్తనాలు వేయాలా..? వద్దా..? అసలు వర్షాలు కురుస్తాయా..? కురవవా..? అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది.

మృగశిర కార్తె తర్వాత వ్యవసాయ పనులను మొదలు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్తె నుంచి తొలకరి వర్షాలు సమృద్ధిగా కురిసేవి. కానీ, ఈ కార్తెకు ముందు జిల్లా వాప్తంగా చిరు జల్లులు పడగా, ఆ తర్వాత ముఖం చాటేశాయి. వారం రోజులుగా రోజూ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఉరుములు, మెరుపులు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే, అంతలోనే గాలులు వీస్తుండడంతో మేఘా లు తేలిపోతున్నాయి. రోజూ ఇదే పరిస్థితి ఉంటున్నది.

వర్షాలు కురుస్తాయని ఆకాశం వైపు ఎదురు చూడడం, అంతలోనే మేఘా లు మాయమవుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. నైరుతి రుతు పవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు భారీ వర్షాలు కురవగానే విత్తనాలు వేయాలని చూస్తున్నారు. కాగా అక్కడక్కడ కురిసిన చిరు జల్లులతో దుకులు సిద్ధం చేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల విత్తనాలు వేశారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ దుకులు కూడా దున్నలేదు.

విత్తనం వేయాలా..? వద్దా..? 

 కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నిన రైతులు విత్తనం వేయాలంటే వెనకాముందవుతున్నారు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు కురవకపోతే మొలకలు రాక మట్టిలోనే విత్తనం మురిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడంతో ఎండల తీవ్రత ఎకువగానే ఉంది. దీంతో చాలా మంది రైతులు విత్తనం వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, మినుము, పెసర, కంది వంటి ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు ఆచితూచి అడుగులేస్తున్నారు. విత్తనం వేసిన తర్వాత సకాలంలో వర్షాలు కురవకపోతే వేసిన విత్తనం నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.

మెదక్ జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో పంటలు.. 

ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందు లో 3.16 లక్షల  ఎకరాల్లో వరి, 36 వేల ఎకరాల్లో పత్తి సాగు, 3 వేల ఎకరాల్లో మొక్క జొన్న, 18,500 ఎకరాల్లో కందులు, 1650 ఎకరాల్లో ఆయిల్ ఫామ్, 5425 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు ప్రణాళిక రూపొందించారు.

అయితే వర్షాభావం కారణంగా సాగు పనులు ఆశించిన స్థాయి లో ప్రారంభం కాలేదు. చెదురుమదురు వ ర్షాల నేపథ్యంలో కొందరు రైతులు పత్తి విత్తనాలు వేసినా అవి పూర్తిస్థాయిలో మొలకెత్త డం లేదు. మరి కొందరు రైతులు దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎల్నినో ప్రభావమేనా..? 

ఈసారి వర్షాల ఆలస్యానికి ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రభావం నెలాఖరు వర కు కొనసాగితే జిల్లాలో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసా య వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగు పై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ వర్షాలు కురుస్తాయనే ఆశతో పలువురు బావుల ఆధారంగా వరి నార్లు పోస్తున్నారు.