23 June, 2026 | 1:13 AM

మియాపూర్‌లో ‘జల’గలు!

23-06-2026 12:00 AM
  1. రైతుల పేరుతో అనుమతులు
  2. రాత్రి వేళల్లో 24 హెచ్‌పీ మోటార్లతో నీటి దోపిడీ
  3. హైటెక్ సిటీ, గచ్చిబౌలికి నిత్యం 3 లక్షల లీటర్ల తరలింపు 
  4. పట్టించుకోని జలమండలి, హెచ్‌ఎండీఏ అధికారులు

శేరిలింగంపల్లి, జూన్ 22 (విజయక్రాంతి): రాత్రి పది గంటలు దాటితే చాలు.. ఆ ప్రాంతంలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ భారీ మోటార్ల రణగొణ ధ్వనులు మొదలవుతాయి. సామాన్యుడు గుక్కెడు తాగునీటి కోసం క్యాన్లతో కిలోమీటర్ల మేర క్యూ కడుతుంటే.. అక్రమార్కులు మాత్రం భూతల్లి గర్భాన్ని జలగల్లా పట్టి పీల్చేస్తున్నారు. మియాపూర్ సర్వే నంబర్ 100, 101 పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను అడ్డుపెట్టుకుని వాటర్ మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న ఈ దందా ఇప్పుడు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.

రాత్రి పడితే ‘మాఫియా’ ఊరేగింపు..

రైతు భూమి పేరుతో అనుమతి తీసుకున్న కొందరు అక్రమార్కులు, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 25 హార్స్ పవర్ సామర్థ్యం గల భారీ మోటార్లను బిగించారు. పగలంతా ప్రశాంతంగా ఉంచే ఈ ప్రాంతంలో రాత్రి కాగానే నిరంతరాయంగా 800 అడుగుల లోతు నుంచి నీటిని తోడేస్తున్నారు. అలా తోడిన నీటిని వరుస కట్టిన ట్యాంకర్ల ద్వారా నగరంలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్లలోని బహుళ అంతస్తుల నిర్మాణాలకు, హోటళ్లకు తరలిస్తున్నారు. ఈ కేంద్రం నుంచి ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్లకు పైగా భూగర్భ జలాలు తరలిపోతున్నట్లు అంచనా.

కుంగుతున్న భూములు.. ఎండిపోతున్న బోర్లు..

‘మాకు తాగడానికి నీళ్లు లేవు.. ఓట్లు వేసి, పన్నులు కడుతున్నా చిన్నపిల్లల కోసం క్యాన్ నీళ్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాం‘ అని స్థానిక మహిళ కన్నీరు పెట్టుకుంది.ఈ భారీ జలదోపిడీ కారణంగా చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల బోర్లు 300 అడుగులు వేసినా చుక్క నీరు పడటం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో భూమి కుంగిపోతోందని, ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లలో మియాపూర్ ప్రాంతం మొత్తం నీటి ఎడారిగా మారే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.కాగితాలకే పరిమితమైన చట్టాలు ‘భూగర్భ జలాల పరిరక్షణ చట్టం-2002’ ప్రకారం వాణిజ్య అవసరాలకు అక్రమంగా నీటిని తోడితే ఆరు నెలల జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలి. ఈ అక్రమాలపై గత నెలన్నరగా ఆధారాలతో సహా కథనాలు వస్తున్నా ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. జలమండలి ఇది మా పరిధి కాదంటూ చేతులెత్తేసింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సిబ్బంది లేరని సాకు చెప్తోంది. 

ఇంతే కాకుండా అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది.. ఒకరిపైకి ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు.  ట్యాంకర్‌కు నెలకు రూ.20వేల వరకు మామూళ్లు వెళ్తున్నాయని, అందుకే రవాణా శాఖ (అర్టీఏ), ట్రాఫిక్ పోలీసులు కూడా ఓవర్లోడ్ ట్యాంకర్లను పట్టించుకోవడం లేదని డ్రైవర్లే బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 

 నీటి అక్రమ  సరఫరాపై  ఈ జలదోపిడీపై ‘విజయక్రాంతి’ ప్రతినిధి హెచ్‌ఎండీఏ ఎస్‌ఐ సంతోష్ను వివరణ కోరగా.. ‘చర్యలు తీసుకుంటాం’ అని తాపీగా సమాధానమిచ్చారు.  సైట్ ఇంచార్జ్ శ్రీశైలం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. అధికారుల కళ్లముందే కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నా ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్రమ బోర్లను సీజ్ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.