ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయండి
- అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలి
- కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా గాంధీసరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలీ చేసినందుకు కేంద్రమంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి అంశాన్ని కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల్లో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటని, దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.దేశరక్షణ, సమగ్రతకు సంబంధించిన అంశం కావడంతో భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం టెర్మినల్ బిల్డింగ్, కార్గో, ఎంఆర్వో, హ్యాంగర్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఇటీవల ఆసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ తమ హ్యాంగర్స్ ఏర్పాటుకు అనుకూల ప్రదేశాలను అన్వేషిస్తున్నాయని, అందుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అనువుగా ఉం టుందన్నారు.
అంతేకాకుండా డీఆర్డీవో/డీఆర్డీఎల్ ఏర్పాటుకు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రాంతాన్ని ఎంపిక చేసినందున, ఆ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.






