calender_icon.png 22 May, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణదాతకు నిలువ ‘నీడ’ కరువు

22-05-2025 12:50:39 AM

  1. ఎండకు ఎండి వానకు తడుస్తున్న అంబులెన్సులు
  2. సిబ్బందికీ వసతి ‘లేమి’!

మహబూబాబాద్, మే 21 (విజయ క్రాంతి): ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రా ణదాతగా నిలుస్తున్న 108 అంబులెన్స్ వాహనాలకు నిలువ నీడ కరువైంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 108 అంబు లెన్సులు 21 నడుపుతున్నారు. అయితే ఇం దులో కేవలం రెండు చోట్ల మాత్రమే అంబులెన్సులకు ఎండా వాన తగలకుండా షెడ్లు ఏర్పాటు చేయగా మిగిలిన 19 ఎండకు ఎం డుతూ వానకు తడుస్తున్నాయి.

ఫలితంగా 108 వాహనాలు తొందరగా దెబ్బతింటున్నాయని విమర్శలు వస్తున్నాయి. 2005 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టారు. అప్ప ట్లో డివిజన్ కేంద్రానికి ఒకటి చొప్పున 108 అంబులెన్స్ లను ఏర్పాటు చేయగా, ఇప్పు డు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 108 అంబులెన్స్ లను కేటాయించారు.

ఆయా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి లేదంటే ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ లో 108 అంబులెన్స్ లను నిలిపి ఉంచుతున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అక్కడికి వెళ్లి క్షతగాత్రు లను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత తిరిగి హె డ్ క్వార్టర్ కు వస్తున్నాయి.

ఖాళీ సమయం లో అంబులెన్సులు నిలపడానికి సరైన వ సతి ఏర్పాటు చేయకపోవడంతో కేటాయించిన ప్రాంతంలో చెట్టు నీడ లేదంటే ఎండ లో పార్కింగ్  చేస్తున్నారు. ఫలితంగా 108 అంబులెన్సులు ఎక్కువ కాలం పని చేయకుండా మన్నిక కోల్పోతున్నాయని చెబుతున్నారు.

సిబ్బందికి అదే పరిస్థితి!

108 అంబులెన్స్ వాహనాల పరిస్థితి మాదిరిగానే అందులో పని చేసే సిబ్బందికి అదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా సిబ్బంది కోసం ఎక్కడ కూడా వసతి ఏర్పాటు చేయలేదు. వాహన డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటి) లు మూడు షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తుండగా వారికి సరైన వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో పనిచేసే వచ్చిన వారికి కొద్దిసేపు ‘రెస్ట్’ తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. 

108 అంబులెన్స్, సిబ్బందికి వసతి కల్పించాలి

ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా సేవలందిస్తున్న 108 అంబులెన్స్, సిబ్బందికి ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించాలి. వాహనం ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన ఆర్.సీ.సీ  షెడ్డు ఏర్పాటు చేయాలి. అలాగే సిబ్బందికి కూడా అక్కడే విశ్రాంతి గది, టాయిలెట్, తాగునీటి వసతి కల్పించాలి.

ఇస్లావత్ రాజు, కేసముద్రం