calender_icon.png 22 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిలింగ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ

22-05-2025 12:51:58 AM

  1. కాళేశ్వరంలో పెరుగుతున్న భక్తుల రద్దీ
  2. ఏడోరోజు లక్షమంది పుణ్యస్నానం
  3. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పుష్కర స్నానం 
  4. వెంపరాల శ్రీనివాసమూర్తి ప్రవచనాలు
  5. అకాల వర్షంతో భక్తుల ఇబ్బందులు

మంథని, మే 21 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరా లు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రిలింగ క్షేత్రం కాళేశ్వరానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ఏడోరోజైన బుధవారం లక్ష మందికి పైగా భక్తులు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. సరస్వతీ పుష్కరాలు సందర్భంగా కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో వెంపరాల శ్రీనివాసమూర్తిచే ‘శివతత్వం’ ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. కాగా కాళశ్వరంలో బుధవారం భారీ వర్షం కురువడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే అప్రమత్తం చేశారు.

కలెక్టర్ వర్షంలో తిరుగుతూ సరస్వతీ ఘాట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షం కారణంగా రోడ్లపై పడిపోయిన ఫ్లెక్సీలు, బ్యానర్లు భక్తుల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్‌లో నీటి మట్టం పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని రెస్క్యూ బృందాలకు సూచించారు.

వర్షం కురిసే సమయంలో గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున భక్తులను త్రివేణి సంగమంలోకి వెళ్లకుండా నియంత్రణ చేయాలని అధికారులకు సూ చించారు.

విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని, వర్షంతో రహదారులు చిత్తడిగా మారినందున నీటి నిల్వలు లేకుండా వాహనాలు వెళ్లడానికి వీలుగా స్టోన్ డస్ట్ వేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల ను గుర్తించి తక్షణమే శుభ్రం చేయాలని, అవసరమైన చోట తాత్కాలిక మార్గాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. 

పరిశుభ్ర పుష్కరం-పవిత్ర పుష్కరం 

సరస్వతీ పుష్కరాలు పరిశుభ్ర పుష్కరం-పవిత్ర పుష్కరం కావాలని కాలుష్య నియం త్రణ మండలి ప్రాజెక్టు అధికారి సత్తయ్య తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో భక్తులు ప్లాస్టిక్ కవర్లు వినియోగం తగ్గించడంపై అవగాహన కల్పించడం కోసం బస్సులకు పోస్ట ర్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నదీ జలాల్లో కలవడం వల్ల పవిత్రమైన నదీ జలాలు కలుషితమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.