calender_icon.png 22 May, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో ముందస్తు వర్షాలు

22-05-2025 12:23:11 AM

  1. కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
  2. సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశం
  3. సిద్ధంగా 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు 

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ముందస్తు వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీంతో రాష్ర్టంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది.

రాష్ర్టంలో మే నెలలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసిన నేపథ్యంలో ముందస్తు చర్యలపై రాష్ర్ట ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ తగు మార్గదర్శకాలను విడుదల చేశారు. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వర్షాలతో సకాలంలో ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు చేరుకోకపోవడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగానే ఈసారి 12 స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్డీఆర్‌ఎఫ్) లను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

ఒక్కో బృందంలో తెలంగాణ స్పెషల్ పోలీస్‌కు చెందిన 100 సుశిక్షితులైన పోలీసులు ఉంటారని.. ఈ బృందాలను రాష్ర్టంలోకి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. అలాగే 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చే జిల్లాల్లో ఈసారి ప్రత్యేకంగా అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని ఫైర్ స్టేషన్లలో ఫైర్ సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నివారణ చర్యలపై  శిక్షణ ఇప్పించామని తెలిపారు. హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాలకు తక్షణమీ స్పందించేలా హైడ్రా బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశముంటే సంబంధిత జిల్లాలకు కేటాయించిన ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో అందుబాటులో ఉండాలని ఆయా బృందాల వివరాలు సంబంధిత అధికారులకు కూడా ఇవ్వాలని సూచించారు. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల ఫైర్ ఆఫీసర్లతో సంప్రదిస్తూ... స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

వరదలు, ముంపు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని కలెక్టర్లకు రాష్ర్ట డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.