25-11-2025 12:48:43 AM
న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంటిలో కోట్ల రూపాయలు విలువ చేసే మెధాంపైటమైన్‌ను ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోలర్ బ్యూరో(ఎన్‌సీబీ) భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.‘ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్’ పేరుతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ఢిల్లీ పోలీసులు దక్షిణ ఢిల్లీలోని ఛత్రపుర్‌లోని ఓ ఇంటిపై నిఘా పెట్టి రూ.262 కోట్ల విలువైన 329 కిలోల మెధాంపైటమైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో విస్తరిస్తున్న అధునాతన మాదకద్రవ్యాల సిండికేట్‌ను నిర్మూలించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ చేపటినట్లు అధికారులు పేర్కొన్నారు. నెలల తరబడి నిఘా ఉంచి దాడి చేసినట్లు డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేసినట్లు అధికారుల తెలిపారు.
ఈ అక్రమ రవాణా ముఠాకు విదేశీ ఆధారిత కింగిపిన్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. విదేశీ హ్యాండ్లర్ల సూచనలతో నిందితులు డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేస్తున్నారని.. వారితో సంప్రదింపుల కోసం ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నాగాలాండ్‌కు చెందిన ఓ మహిళ డ్రగ్స్ రవాణాలో వీరికి సహకరిస్తున్నట్లు గుర్తించామన్నారు.
డ్రగ్స్ రాకెట్టు గుట్టు రట్టు చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్‌సీబీ అధికారులను, ఢిల్లీ పోలీసులను అభినందించారు. భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.