31-12-2025 10:17:14 AM
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల ఎలాంటి ఉపేక్ష చూపబోమని నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్(CP Sajjanar) హెచ్చరించారు. ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో, సజ్జనార్ మాట్లాడుతూ... బుధవారం రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా 120 చోట్ల ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు(Drunk driving checks) నిర్వహిస్తామని తెలిపారు.
ఈ ప్రత్యేక తనిఖీల కార్యక్రమం జనవరి మొదటి వారం అంతా కొనసాగుతుందని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానాలు, వాహనాలను స్వాధీనం చేసుకోవడం, జైలు శిక్షలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్(Rash driving), ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పౌరులకు సలహా ఇస్తూ, మద్యం సేవించిన వ్యక్తులు డ్రైవింగ్ చేయకుండా, క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో సురక్షితంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్(City Police Commissioner) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.