22 July, 2026 | 8:47 PM

Breaking News

తైబజార్.. మామిడి రైతులు బేజార్

01-06-2024 03:00 AM

కాంట్రాక్టర్ల రోజువారీ వసూళ్లతో ఇబ్బందులు  

లెక్కకు మించీ రుసుముతో రైతులకు చుక్కలు

నాగర్‌కర్నూల్, మే 31 (విజయక్రాంతి): మామిడి రైతులపై కొందరు వ్యక్తులు తైబజార్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో మామిడి విరివిగా సాగు చేశారు. అయితే, జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులే నేరుగా రోడ్ల పక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. ఇప్పటికే వర్షాభావం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుల వద్ద తైబజార్ నిర్వాహకులు రుసుం పేరిట ఇష్టారీతిగా వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు.

మున్సిపల్ నిబంధనల ప్రకారం వీధి విక్రయదారుల వద్ద రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని, కానీ పట్టణ కేంద్రాల్లో తైబజార్ కాంట్రాక్టర్లు ఎలాంటి రశీదులు ఇవ్వకుండా ఒక్కో మామిడి రైతు నుంచి రోజుకు రూ.200పైనే వసూలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు స్పందించి, అడ్డగోలు వసూళ్లపై చర్యలు తీసుకుని, కాంట్రాక్టర్ల జులుం నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.