22 July, 2026 | 7:44 PM

గోవులను అక్రమంగా తరలించొద్దు

01-06-2024 03:04 AM

వెటర్నరీ డాక్టర్ల సర్టిఫికేట్ తప్పనిసరి

హైదరాబాద్ సీపీ కె శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, సిటీబ్యూరో, మే 31 (విజయక్రాంతి) : బక్రీద్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయా లని సీపీ సూచించారు. అలాగే వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా అవులను తరలించరాదని స్పష్టం చేశారు. ఇందుకోసం హైద రాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.

అక్రమంగా పశువులను తరలించే వాహనాలను సీజ్ చేసి వెంటనే జీహెచ్‌ఎంసీ సూచించిన పశువుల హోల్డింగ్ పాయింట్లు, గోశాలలకు తరలించాలన్నారు. ముఖ్యంగా పశువులను తరలిస్తున్న వాహనాలను ఆపడం, తనిఖీ చేయడంపై ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. చెక్‌పోస్టుల వద్ద వెటర్నరీ వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. బక్రీద్ పండగ లోపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టి వేరే ప్రాంతాలకు తరలించాలని, అందుకోసం క్యాచింగ్ డాగ్ స్వాడ్‌లను నియమించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, రవాణా శాఖ కమిషనర్ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ వెటర్నరీ డైరెక్టర్ సిహెచ్. మల్లీశ్వరి, చీఫ్ వెటర్నరీ అధికారిడాక్టర్ అబ్దుల్ వకీల్, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.