08-02-2026 03:41:58 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): దాసారం బస్తి, సి టైప్ క్వార్టర్స్, రవీందర్ నగర్ కాలనీ, బాలయ్య నగర్, బాలయ్య నగర్ వెస్ట్ పరిసర రెసిడెన్షియల్ కాలనీల్లో తీవ్ర ప్రజారోగ్య, భద్రతా సమస్యలు నెలకొన్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ సమస్యలపై ఆదివారం దాసారం బస్తి వాసులు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను తమ ప్రాంతానికి తరలించి, చెత్తతో నిండిన వాహనాలను గంటల తరబడి, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి ఇక్కడే నిలిపివేస్తున్నారని తెలిపారు.
చెత్తలో కుళ్లిపోయిన వ్యర్థాలు, మృత జంతువులు కూడా ఉండటంతో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం దోమలు, ఈగలు, ఎలుకలు, వీధి కుక్కల పెంపకం కేంద్రంగా మారిందని, డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మున్సిపల్, ఆరోగ్య, పోలీస్ తదితర శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలిక శుభ్రత చర్యలు చేపడుతూ, కొద్ది రోజుల్లో మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు.
ఇప్పటివరకు ఎటువంటి శాశ్వత పరిష్కారం అందించలేదని అన్నారు.రాత్రి వేళల్లో మహిళలు, యువతలు బయటకు రావడానికి భయపడుతున్నారని, అసభ్య వ్యాఖ్యలు, వేధింపులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 2024 దసరా సందర్భంగా జరిగిన హత్య ఘటనకు కూడా ఈ అక్రమ గుడిసెలు, అసాంఘిక కార్యకలాపాలే కారణమని స్థానికులు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా స్థానికులు పలు డిమాండ్లు చేశారు. అక్రమ గుడిసెలను తక్షణమే తొలగించాలని, చెత్త డంపింగ్ మరియు చెత్త వాహనాల పార్కింగ్‌ను శాశ్వతంగా ఇతర ప్రాంతానికి మార్చాలని కోరారు.
మృత జంతువుల చెత్త వేయడాన్ని పూర్తిగా నిలిపివేయాలని, పూర్తి స్థాయి శానిటేషన్, వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టాలని, రాత్రి పోలీసు పెట్రోలింగ్ పెంచాలని, అక్రమంగా నిలిపిన వాహనాలను తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో దాసారం బస్తి అధ్యక్షుడు పోతురాజు కుమార్, విక్రమ్ పంతులు, ఎస్. ఉషారాజ్, పి.రాజ నర్సింగ్, బాలయ్య నగర్ వెస్ట్ అధ్యక్షుడు సిహెచ్. సుధీర్ కుమార్, జనరల్ సెక్రటరీ పి. శ్రీనివాస్, రవీందర్ నగర్ అధ్యక్షుడు విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.సమస్యలకు తక్షణ పరిష్కారం చూపకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు.