calender_icon.png 8 May, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ చిత్రాలపై వంద శాతం సుంకాలు

06-05-2025 12:00:00 AM

  1. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
  2. హాలీవుడ్‌ను కొందరు నాశనం చేస్తున్నారని వ్యాఖ్య

వాషింగ్టన్, మే 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే సుంకాల మోతతో పలు రంగాలను కుదిపేసిన ఆయన తాజాగా సినీ పరిశ్రమను వదల్లేదు. అమెరికాలో షూటింగ్ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్న ట్రంప్.. ఇకపై అమెరికాలో విడుదలయ్యే విదేశీ చిత్రాలపై వంద శాతం సుంకాలు విధించాలని యూఎస్ వాణిజ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతోందన్నారు. మా దర్శక, నిర్మాతలు, స్టూడియోలను అమెరికా నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు.

దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయని, ఇతర దేశాలు చేస్తున్న సమష్టి కుట్ర అని పేర్కొన్నారు. అందువల్లే విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలోకి వచ్చే సినిమాలపై వంద శాతం సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వాణిజ్య శాఖకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు.