08-05-2025 01:50:53 AM
చర్ల, మే 7 (విజయక్రాంతి): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగింది. కర్రెగుట్టల్లో మావో యిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవ కాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. నిన్న కూడా కర్రెగుట్టలపై ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఘటనా స్థలంలో 303 -రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు కర్రెగుట్టల ఆపరేషన్‌లో నలుగురు మహిళా మావోయిస్టులు చనిపోయారని, వందల సంఖ్య లో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. బీఎస్‌ఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ బలగాలు ఆ ప్రాం తాన్ని సెర్చ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఐఈడీ పేలిం ది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడటంతో వెంటనే శిబిరానికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అనంతరం హెలికాఫ్టర్‌లో బీజాపూర్ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు కూడా ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆపరేషన్ కర్రెగుట్టల్లో దాదాపు 200 ఐఈడీలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. దాదాపు 15 రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే వందలాది మావోయిస్టుల రహస్య స్థావరాలు, బంకర్లను గుర్తించారు. మావోయిస్టుల స్థావరాల నుంచి వేల కిలోల పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం సెర్చ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 22 మంది మరణించగా, 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 26 మంది మావోయిస్టులు మరణించినట్టు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు.
అసిస్టెంట్ కమాండెంట్ మృతి
తెలంగాణ- సరిహద్దుల్లో ‘ఆపరేషన్ కగార్’లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం కర్రెగుట్టల్లో విస్తృతంగా గాలిస్తున్న భద్రతా బలగాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఐదు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 10 వేల మందికి పైగా జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో సాగుతున్న ఈ ఆపరేషన్‌లో.. 204 కోబ్రా బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బొరడే ప్రమాదవశాత్తు మరణించాడు.
అడవిలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌పై ఆయన కాలు మోపడంతో భారీ పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన సాగర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ.. మార్గ మధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్రె గుట్టల ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేసినట్టు సమాచారం అందడంతో.. వారిని నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర బలగాలు ’ఆపరేషన్ కగార్’ను కొనసాగిస్తున్నాయి.
క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, మావోయిస్టులు వ్యూహాత్మకంగా అమర్చిన మందుపాతరలు భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారాయి. అయినప్పటికీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన కే9 (డాగ్ స్క్వాడ్), కే3 బృందాల సహాయంతో కూంబింగ్ ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పలువురు నక్సల్స్ మృతి చెందగా.. వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా కూబింగ్ కొనసాగిస్తున్నారు.