calender_icon.png 5 May, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి క్షిపణి పరీక్షతో పాక్ కవ్వింపు చర్యలు

05-05-2025 05:07:53 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పై పాకిస్థాన్ మరోసారి క్షిపణి పరీక్షతో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భూమి నుంచి భూతలంపైకి 120 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించే ఫతా సిరీస్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పాక్ ఇటివలే 450 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించే అబ్దాలి క్షిపణిని పరీక్షించింది. ఫతా క్షిపణి లక్ష్యం సైనికుల కార్యచరణ, సంసిద్ధతను నిర్ధరించడం, క్షిపణుల ఆధునాతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధ్రువీకరించడం వంటి తాజా ప్రయోగం చేపటినట్లు పాకిస్థాన్ పేర్కొంది. 

ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల ఏప్రిల్‌ 30- మే 2 మధ్య మరోసారి పరీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించిన పాక్ ఇప్పుడు 120 కి.మీ లక్ష్యం ఛేదించే క్షిపణిని ప్రయోగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత 11 రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైనికులు వరుసగా భారత్ సైన్యంపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో భారత్ తమపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని పాక్ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తమ సరిహద్దులో భారీగా సైన్యం మోహరించడంతో పాటు గగనతల రక్షణ, ఫిరంగి వ్యవస్థలను సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఏప్రిల్ 23న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించడంతో పాక్ హైకమిషన్ అధికారులను పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. భారత్ లో ఉంటున్న పాకిస్థానీయులు వారంలోపు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద అందించిన వీసాలను రద్దు చేయాలని,పాకిస్థాన్ కు చెందిన వస్తువుల ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతులపై తక్షణ నిషేధం విధించింది.