08-05-2025 01:47:30 AM
న్యూఢిల్లీ, మే 7: కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కేంద్ర రక్షణ, విదేశాంగశాఖ తరఫున ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కూలంకషంగా వివరించి యావత్ దేశ ప్రజలను ఆకర్షించారు. వారిద్దరూ ఎంతో చాకచక్యంగా ప్రసంగించారు. నోటి నుంచి ప్రతి మాట తూచినట్లుగా ఉండడం అందరిన్నీ ఆకట్టుకున్నది. ఈ నేపథ్యంలో వారిద్దరు ఎవరు.. వారి నేపథ్యం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
బయో కెమెస్ట్రీ నేపథ్యం నుంచి సోఫియా..
గుజరాత్‌కు చెందిన సోఫియా బయోకెమెస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1990లో ఆమె భారత సైన్యంలో చేరారు. తొలిరోజుల్లో ఆమె సిగ్నల్ కోర్‌కు చెందిన సీజన్డ్ అధికారి. ప్రపంచంలో శాంతి వర్థిల్లాలనే కాంక్ష ఆమెలో బలంగా ఉండేది. దీనిలో భాగంగానే ఆమె ఐక్యరాజ్యసమితి ‘పీస్’ కమిషన్’కు ప్రాతినిథ్యం వహించారు. 2006లో ఆమె కాంగోలో విధులు నిర్వర్తించారు.
2016లో పుణెలో జరిగిన ‘ఎక్సర్‌సైజ్ 18’ పేరిట నిర్వహించిన డ్రైవ్‌కు ఆమె భారత సైన్యం తరఫున నాయకత్వం వహించారు. 18 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ డ్రైవ్ అప్పట్లో సంచలనం.మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె దేశానికి విశిష్ట సేవలు అందించారు.
ఎన్‌సీసీ నేపథ్యం నుంచి వ్యోమికా..
వ్యోమికా సింగ్ పాఠశాల విద్య రోజుల్లోనే ఎన్‌సీసీ క్యాడెట్‌గా అనేక క్యాంపుల్లో భాగస్వామి అయ్యారు. తర్వాత ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఎయిన్‌ఫోర్స్‌లో పనిచేయాలనే ఆకాంక్ష ఆమెకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఆమె ఎయిర్‌ఫోర్స్‌లో చేరి ఆ కలను నెరవేర్చుకున్నారు. తొలిరోజుల్లో ఆమె హెలికాఫ్టర్ పైలట్‌గా విధులు నిర్వర్తించారు.
18 డిసెంబర్ 2019న ఆమె ప్రతిష్ఠాత్మక ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా సాధించారు. అత్యంత సంక్లిష్ట భూభాగాలు ఉన్న నార్త్ ఈస్ట్‌లో ఆమె చేతక్, చీతా హెలికాఫ్టర్లు నడిపారు. అంతేకాక భారత సైన్యం జరిపిన అనేక క్లిష్టమైన ఆపరేషన్లలో ఆమె కీలక సేవలు అందించారు.
25నిమిషాల్లో ‘సిందూర్’ పూర్తిచేశాం!
మంగళవారం అర్ధరాత్రి 1.05 గంటలకు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించామని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. 1.30 గంటలకు పూర్తి చేశామని, కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని స్పష్టం చేశారు. పహల్గాం మృతులు, వారి కుటుంబాలకు న్యాయం చేయడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ఎల్వోసీకి 30 కిలోమీటర్ల దూరంలో గుల్పూర్ ఉగ్రవాద శిబిరం ఉందని, ముందుగా ఆ శిబిరాన్ని తాము టార్గెట్ చేశామని తెలిపారు. 2023 ఏప్రిల్‌లో పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడి కోసం.. ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని వెల్లడించారు.
కల్నల్ సోఫియా ఖురేషి
దాడులను ఎదుర్కొంటాం
పాకిస్థాన్ ఎలాంటి దాడులకు పూనుకున్నా భారత సైన్యం వాటిని ఎదుర్కొంటుందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
వింగ్ కమాండర్ వ్యోమికా