calender_icon.png 7 May, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్వత ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ!

06-05-2025 12:00:00 AM

  1. రహస్య స్థావరాల నిర్మాణం, అడవుల్లో నక్కి జీవించడంపై ముష్కరులకు శిక్షణ 
  2. కశ్మీర్ జైళ్లలోని ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు
  3. 54 మార్గాల్లో భద్రతా బలగాల తనిఖీలు

న్యూఢిల్లీ, మే 5:  పహల్గాం ఉగ్రదాడి విచారణలో భాగంగా జమ్మూ కశ్మీర్ జైళ్లలోని ఉగ్రవాదుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో పాల్గొన్న వారికి పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాల నిర్మాణంలో పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తేలింది. దీంతో పాటు రోజుల తరబడి అడవుల్లో దాక్కొని జీవించడం ఎలానో కూడా నేర్చించారు. ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్రస్థావరాలు, ఇతర దర్యాప్తుల విచారణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ నేపథ్యంలో భద్రతా దళాలు బైసరన్ లోయ చుట్టూ ఉన్న మార్గాలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు భద్రతా దళాలు ఈ లోయ నుంచి మొదలయ్యే 54 మార్గాలను గుర్తించి తనిఖీలు చేపడున్నారు. ఇవన్నీ చిక్కటి అటవీ ప్రాంతం, పర్వతాల మీదుగా సాగుతాయి.

ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ సాయం చేసిన కొందరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లను అదుపులోకి తీసుకొన్న దళాలు వారిని తీసుకొని ఈ మార్గాలను గాలిస్తున్నాయి. మరోవైపు దక్షిణ కశ్మీర్ అడవుల్లో భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. కానీ ఈ గాలింపు గోప్యత దెబ్బతింటుందని అధికారులు ఆ వివరాలను బహిర్గతం చేయడంలేదు.