08-05-2025 02:04:51 AM
పహల్గాం దాడికి ప్రతీకారం
* ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. ఆపరేషన్ సిందూర్‌తో భద్రతాబలగాలు కచ్చితమైన దాడి చేశాయి.
ప్రధాని నరేంద్రమోదీ
* దేశ భద్రతా బలగాల చర్యలపై ఎంతో గర్వంగా ఉంది. పహల్గాంలో చోటు చేసుకున్న దారుణ హత్యలకు ప్రతిస్పందనే ఈ ఆపరేషన్. భారత్‌పై, దేశ ప్రజలపై జరిగే ఏ దాడికైనా తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉంది.
కేంద్రహోంమంత్రి అమిత్‌షా
* భారత సైన్యం తన సత్తా చాటింది. పాక్ పౌరుల ప్రాణాలకు నష్టం కలిగించకుండా దాడులు నిర్వహించాం. రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. లంకాదహనం చేసిన హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
పాక్, పీవోకేలోని 9 ఉగ్రవాద శిబిరాలు లక్ష్యాలుగా దాడులు
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత..
౨౫ నిమిషాలు భారత సైన్యం ఆపరేషన్ సిందూర్
80 మంది టెర్రరిస్టులు మృతి సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్
భారత్ మాతాకీ జై.. హర్‌హర్ మహాదేవ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రువులకు తగిన గుణపాఠం చెప్పాం. భారత్ మాతాకీ జై.. హర్‌హర్ మహాదేవ్.. జైహింద్.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దేశం హర్షిస్తోంది
మతం పేరు అడిగి అమాయక పౌరులను కాల్చిచంపిన ఉగ్రవాదులను మట్టుబె ట్టిన సైన్యాన్ని దేశమంతా అభినందిస్తోంది.. హర్షిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను ప్రజలంతా స్వాగతిస్తున్నారు. భారత్‌తో పెట్టు కుంటే కొరివితో తల గోక్కున్నట్టే.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్
* సాయుధ దళాలు తీసుకున్న చర్య ఎంతో గర్వంగా ఉంది. వారి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని అభినందిస్తున్నాం.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున్ ఖర్గే
తొమ్మిది ప్రాంతాలివే..
1. బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్: జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయం ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2. ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న జైషే కార్యాలయాల్లో ఒక కార్యాలయం ఈ ప్రాంతంలో ఉంది.
3. తెహ్రా కలాన్‌లోని సర్జల్: ఇక్కడ కూడా జైషే మహ్మద్ ఉగ్రస్థావరం ఉంది.
4. కోట్లిలోని మర్కాస్ అబ్బాస్: జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయం ఉన్న ఈ ప్రాంతం ఎల్‌వోసీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
5. మురిద్కేలోని మర్కాజ్ తోయిబా: పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ నగరంలో లష్కరే తోయిబా కార్యాలయం ఉంది. సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉంది.
6. ముజఫరాబాద్‌లోని షవాయ్ నల్లాహ్: పీవోకేలో ఉన్న ఈ ప్రాంతంలో లష్కరే తోయిబా క్యాంప్ ఉంది. ఇది సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉంది.
7. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్: ఇక్కడ కూడా లష్కరే తోయిబా క్యాంప్ కార్యాలయం ఉంది.
8. సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా: ఈ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కార్యాలయం ఉంది. సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఉంది.
9. కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్: పీవోకేలో ఉన్న ఈ ప్రాంతంలో కూడా హిజ్బల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కార్యాలయం ఉంది.
* ఆకుపచ్చని కశ్మీరంలో ఉగ్రమూకలు రాసిన రక్తచరిత్రకు భారత బలగాలు బదులి చ్చాయి. శత్రువుల వెన్నులో వణుకు పుట్టేలా, వారి ఊహలకు అందని విధంగా, కలలో కూడా ఉలిక్కిపడే రీతిలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఆకస్మిక దాడులు చేశాయి. జెట్ స్పీడ్‌తో పనిని పూర్తి చేశాయి. భారత్ మమ్మల్నేం చేస్తుందిలే అని విర్రవీగి, జబ్బలు చరు చుకున్న దాయాదికి, ఉగ్రమూకలకు భారత సైనం సరైన జవాబు ఇచ్చింది.
మాక్ డ్రిల్స్‌తో దేశాన్ని సమాయత్తం చేస్తున్నట్టు చూపించి.. పాక్‌కు భారత్ అసలు సినిమా చూపించింది. సిందూరాన్ని తక్కువగా అంచనా వేసిన దాయాదికి సరైన బుద్ధ్ది చెప్పారు. ఈ చర్యతో యావత్ దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్ తన సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
న్యూఢిల్లీ, మే 7: పహల్గాంలో ఉగ్రమూకలు నరమేధం సృష్టించి రెండువారాలు కావస్తున్నా భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవట్లేదే అని ఎదురుచూసిన భారతావనికి కేంద్రం, సైనిక, వైమానిక దళా లు ‘ఆపరేషన్ సిందూర్’తో సమాధానమిచ్చాయి. ఉగ్రమూకలను భారత సైన్యం చీల్చి చెండాడింది. పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండానే కేవలం 25 నిమిషాల వ్యవధిలో 24 మిసైళ్ల ద్వారా 9 ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేశాయి.
మన సైనిక దళాలు సాధించిన ఈ విజయం పట్ల ప్రతి భారతీయుడు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. బుధవారం ఉదయం 1.05-1.30 మధ్యలో ఈ దాడులు జరగ్గా, భారత సైన్యం తెల్లవారు జామున 1.44కు ఈ దాడులపై ప్రకటన చేసింది. పాకిస్థాన్‌లో నాలుగు ప్రదేశాల్లో, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు జరిపారు.
మన సైనిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించకుండానే ఈ దాడులు చేయడం గమనార్హం. ఈ దాడులను పాకిస్థాన్ సైన్యం కూడా ధ్రువీకరించింది కానీ చనిపోయిన వారి సంఖ్యను తక్కువ చేసి చూపించింది. ఆపరేషన్ సిందూర్ దాడులను యుద్ధ చర్య గా అభిర్ణించింది. ఈ దాడుల తర్వాత పహ ల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ విశేషాలను కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా కు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో దాదాపు 80 మంది టెర్రరిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత చర్యను సమర్థించాయి. పశ్చి మ దేశాలకు చెందిన మీడియా తొలిసారిగా ‘టెర్రరిస్ట్’ అనే పదాన్ని ఉపయోగించడం గమనార్హం. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడులపై స్పందించారు.
ఎవరైతే అమాయకులను బలి తీసుకున్నారో వారిని లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేపట్టినట్టు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ తన అన్ని పర్యటనలను రద్దు చేసుకున్నారు. బుధవారం క్యాబినెట్ భేటీ నిర్వహించిన ప్రధాని, రేపు అఖిలపక్ష భేటీ కోసం సమాయత్తం అయ్యారు.
పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. బుధవారం పాక్ రేంజర్లు సరిహద్దుల్లో జరిపిన కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి చెందినట్టు ఆర్మీ తెలిపింది. మరో 43 మంది ఈ కాల్పుల్లో గాయపడ్డారు.
విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్న ప్రధాని
ప్రధాని మోదీ త్వరలో యూరప్, క్రియేషియా, నార్వే, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ఠ్యా ఆయన పర్యటనలు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ రష్యా పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
కసబ్‌కు శిక్షణనిచ్చిన శిబిరం నేలమట్టం
26/11 ముంబై దాడుల్లో పాల్గొని.. సజీవంగా భారత దళాలకు చిక్కిన ఉగ్రవాది కసబ్, ఆ దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన ఉగ్రస్థావరాలు కూడా ఆపరేషన్ సిందూర్ దాడుల్లో ధ్వంసమయ్యాయి.ముంబై దాడుల ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
సరిహద్దుల వెంట ఆగని పాక్ దాడులు
పాకిస్థాన్ సరిహద్దుల వెంబడిదాడులు ఆపడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్ల పొడుస్తూ పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 15 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 43 మంది గాయపడినట్టు ఆర్మీ వెల్లడించింది. పూంచ్, తంగ్దర్ ప్రాంతాల్లో సాధారణ నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు కాల్పులకు దిగాయని ఆర్మీ పేర్కొంది.
పాల్గొన్న డ్రోన్లు, క్షిపణులివే
పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లకుండానే భారత్ తొమ్మిది ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేక రకాల ఆత్మా హుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామ్మర్ బాంబులను వాడారు. అంతే కాకుండా ఆత్మాహుతి డ్రోన్లు కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. భారత్ వద్ద ఇటువంటి ఆత్మాహుతి డ్రోన్లు అనేకం ఉన్నాయి. ఈ డ్రోన్లను ఉపయోగించడం వలన భారత ఆర్మీకి ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవచ్చు. కదులుతున్న లక్ష్యాలను కూడా ఇవి కచ్చితంగా ఛేదించగలవు.
స్కాల్ప్ క్షిపణులు
స్కాల్ప్ మిషన్లను స్ట్రామ్ షాడోలుగా కూడా వ్యవహరిస్తారు. ఈ తరహా క్షిపణులను ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇవి ఛేదించగల్గుతాయి. ఈ మిస్సైల్స్‌ను యుద్ధవిమానాలపై నుంచి కూడా ప్రయోగించొచ్చు. దూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఇవి కచ్చితత్వంతో ఛేదిస్తాయి కనుక ఈ దాడులకు భారత్ వీటిని ఉపయోగించింది.
హ్యామ్మర్ స్మార్ట్ బాంబులు..
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో హ్యామ్మర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించారు. ఈ బాంబులను కూడా ఫ్రాన్స్‌కు చెందిన సంస్థే అభివృద్ధి చేసింది. ఈ బాంబులు బంకర్లు, భారీ భవనాలను సులభంగా విచ్ఛిన్నం చేయగల్గుతాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఈ రకమైన బాంబులను ఉపయోగించారు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇవి నేలమట్టం చేయగల్గుతాయి.
అమాయక పౌరులు చనిపోయారు..
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ మిలటరీ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు పౌర ప్రాంతాల్లో దాడులు చేయలేదని.. మా లక్ష్యం సామాన్య పౌరులు కాదని ఇండియన్ ఆర్మీ చెబుతుంటే పాక్ మాత్రం వేరేలా చెబుతోంది. ఈ దాడి అనంతరం పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఈ దాడిని ఖండించారు.
ఇదో పిరికి.. అన్యాయమైన చర్య. ఈ దాడుల వల్ల మా పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల విడుదల చేసిన ప్రకటనలో ఆపరేషన్ సిందూర్ పాకిస్థానీయుల సార్వభౌమాధికారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న సాధారణ పౌరులపై కూడా విరుచుకుపడిందని పేర్కొంది.
ఆ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ యూఎన్ చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం పాకిస్థాన్ తనకు నచ్చిన రీతిలో నచ్చిన సమయం, స్థలంలో స్పందిచవచ్చని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 70-80 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది.