ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తం
- నిజామాబాద్ అటవీశాఖ ఉద్యోగులు స్పష్టం
- పోడు రైతుల దాడికి నిరసనగా నిజామాబాద్‌లో నిరసన
నిజామాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారులపై దాడి హేయమైన చర్య అని, దాడిని నిరసిస్తూ అటవీ శాఖ అధికారులు నిజామాబాద్‌లో నిరసన తెలిపారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు అందించాలని, తమకు రక్షణ కల్పించాలంటు డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారులపై నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ లం కాల్పోల్‌లో దాడిని నిరసిస్తు పారెస్ట్ అధికారులు నిజామాబాద్ అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఫారెస్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. అటవీ రక్షణకు ఫారెస్ట్ ఉద్యోగులు అహరహం కృషిచేస్తున్నారని తెలిపారు. అటవీ భూముల్లో చెట్లు నరికి పోడు వ్యవసాయం చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న తమపై దాడి సరికాదని అన్నారు. గతంలో ఇలాంటి దాడుల్లో ఎంతో మంది అటవీశాఖ అధికారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆయుధాలు ఇచ్చి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వమైనా ఆయుధాలు ఇవ్వాలని, లేదంటే తాము డ్యూటీ చేయలేమన్నారు. నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఏసీపీకి తమకు రక్షణ కల్పించాలం టు వినతి పత్రం సమర్పించారు.






