11 August, 2026 | 2:51 AM

కొలంబియాలో భూకంపం

11-08-2026 12:55 AM

111 మంది మృతి.. ధ్వంసమైన భవనాలు 

బొగోటా, ఆగస్టు 10: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రత నమోదైంది. భారీగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ముఖ్యంగా పశ్చిమ కొలంబియా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం ౧౧౧ మంది మరణించినట్లు తెలుస్తోంది. అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. సోమవారం ఉదయం 7.34 గంటల సమయంలో చొకో రీజియన్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మర్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

భూకంపం భూమి లోపల 107 కిలోమీటర్ల లోతున సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంపం ప్రభావం పొరుగున ఉన్న ఈక్వెడార్ దేశంలో కూడా కనిపించింది. స్థానిక గవర్నర్ నుబియో కార్డోబా మాట్లాడుతూ భవనాలకు తీవ్ర నష్టం జరిగిందని, అనేకమంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొలంబియా రాజధాని బోగోటాలో ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు.

పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ నగరాలు ధ్వంసమయ్యాయి. కొలంబియా వ్యాప్తంగా 20కిపైగా మున్సిపాలిటీల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా ఈ భారీ భూకంపం వల్ల కొలంబియాలోని రవాణా వ్యవస్థకు పూర్తిగా నష్టం వాటిల్లింది. రన్‌వేలు కూడా దెబ్బతినడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పశ్చిమ కొలంబియాలోని ఆరు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను నిలిపివేశారు. పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా నగరాలకు వెళ్లే విమానాశ్రయాలు మూతపడ్డాయి.