సెమీఫైనల్లో ఈస్ట్ జోన్
- నార్త్ ఈస్ట్ జోన్‌పై ఘన విజయం
- బంతితో మెరిసిన వైభవ్ సూర్యవంశీ
బెంగళూరు, ఆగస్టు 25: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ మరియు 210 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 112.5 ఓవర్లలో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సుదీప్ కుమార్ ఘరమి (146), షాబాజ్ అహ్మద్(167) సెంచరీలతో చెలరేగారు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకు ఆలౌటైంది. అభిజిత్ సర్కార్ ఐదు వికెట్లు తీయగా.. షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనుకుల్ రాయ్కు ఒక వికెట్ దక్కింది. మహమ్మద్ షమీ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్లోనూ నార్త్ ఈస్ట్ జోన్ 146 పరుగులకే కుప్పకూలింది.
అనుకుల్ రాయ్ ఐదు వికెట్లు తీయగా.. వైభవ్ సూర్యవంశీ రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్, షెహ్బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. బ్యాటింగ్లో అత్యధికంగా 167 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్లో మొత్తం 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ఈ విజయంతో ఈస్ట్ జోన్ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 2 వరకు జరగబోయే సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌తో తలపడనుంది.






