పట్టుబిగించిన భారత్
జురెల్ సెంచరీ
భారత్ స్కోరు 503/9 డిక్లేర్డ్
శ్రీలంక ప్రస్తుతం 8/2
వర్షంతో పూర్తిగా సాగని ఆట
కొలంబో టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలిరోజు పడిక్కల్ సెంచరీతో చెలరేగితే, రెండో రోజు జురెల్ శతకంతో దుమ్మురేపాడు. పంత్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో భారీ స్కోరు సాధించింది. తర్వాత బౌలింగ్ లోనూ అదరగొట్టి ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టింది.
కొలంబో, ఆగస్టు 24: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ అధిపత్యం కొనసాగుతోంది. రెండోరోజు సైతం బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ అదరగొట్టింది. రెండో రోజు ఆటకు వరుణుడు పలుమార్లు అడ్డుపడడంతో పూర్తి ఆట సాధ్యపడలేదు. అయితే రెండో రోజు ఆటలో జురెల్ సెంచరీ హైలైట్ గా నిలిచింది.300/5 ఓవ్నట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓవ్నట్ బ్యాటర్ సారాన్ష్ జైన్(6) రెండు పరుగులు మాత్రమే చేసి అసితా ఫెర్నాండో బౌలింగ్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు.
దాంతో తొలి రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషభ్ పంత్ మళ్లీ బ్యాటింగ్కు దిగాడు.జురెల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తనదైన శైలిలో చెలరేగిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా పంత్ భారీ షాట్లతో లంకబౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పంత్ 81 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకోగా.. ధ్రువ్ జురెల్ 97 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.రెండో సెషన్లో పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అయితే అతన్ని కుశార నువాంత క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఏడో వికెట్కు నమోదైన 112 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి మానవ్ సుతార్ రాగా.. ధ్రువ్ జురెల్ తన జోరును కొనసాగించాడు. ఆచితూచిన ఆడిన మానవ్ సుతార్(18)ను ప్రబాత్ జయసూర్య కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చగా.. సిరాజ్తో కలిసి ధ్రువ్ జురెల్ రెండో సెషన్ను ముగించాడు. వర్షం కారణంగా కాస్త ముందుగానే ఈ సెషన్ ముగిసింది.ఆఖరి సెషన్లో దూకుడుగా ఆడిన ధ్రువ్ జురెల్ 171 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఆ వెంటనే భారీ సిక్సర్తో ధ్రువ్ జురెల్ తన జోరు కనబర్చగా.. సిరాజ్(3) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడిన ధ్రువ్ జురెల్ వేగంగా పరుగులు రాబట్టి జట్టు స్కోర్ను 500 ధాటించాడు. ఆ వెంటనే భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లెర్డ్ చేసింది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో (4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది.
శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. లాహిరు ఉడారా(1) ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. ప్రభాత్ జయసూర్య(2)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు. వర్షం కారణంగా రెండో రోజు 56 ఓవర్ల ఆట సాధ్యమైంది.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్ (పడిక్కల్ 117, జురెల్ 115 , పంత్ 63 , గిల్ 50, జడేజా 43 ; అసితా ఫెర్నాండో 4/106)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 8/2 (కమిల్ మిశ్రా 5 బ్యాటింగ్ ; ప్రసిద్ధ కృష్ణ 1/1, మానవ్ సుతార్ 1/6 )






