21 May, 2026 | 2:42 AM

ఐపీఎల్ బెట్టింగ్‌తో యువత ఆగం

19-05-2026 12:00 AM

దేశంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఐపీఎల్ అనే మాటే వినిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. క్రికెట్ అంటే అభిమానం ఉన్నవారు టీవీలకే అతుక్కుపోతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక వేదిక అందించడం, దేశంలోని యు వ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న ఐపీఎల్ ఉద్దేశం నీరుగారిపోతోంది.

ఒకవైపు క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదిస్తూనే, మరోవైపు సందట్లో సడేమియా లాగా పందెం రాయుళ్లు  బెట్టింగ్ కాస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ బెట్టింగ్ దందాలో రోజు కోట్లాది  రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యసనం టీ-20ల రాకతో ఎక్కువైపోయింది. దీనికి తోడు ఐపీఎల్ యువతను మరింత కట్టిపడేసింది.

ఒకే సీజన్‌లో వరుసగా 70కి పైగా మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టిం గ్ జోరుకు అడ్డూఅదుపూ లేకుండాపోయిం ది. బెట్టింగ్‌కు బానిసలుగా మారిన చాలామంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, తమ కుటుంబాలను రోడ్డు న పడేస్తున్నారు. ఈ జాఢ్యం ఇంతకుముం దు నగరాలకే పరిమితం కాగా ప్రస్తుతం పల్లెలకు కూడా పాకింది. బెట్టింగ్‌లో ఎక్కువగా పోగొట్టుకుంటున్నది యువతే కావడం బాధాకరం. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో క్రికెట్‌లో గెలుపోటములపై వారు బెట్టింగ్ వేస్తున్నారు.

యువత చేతుల్లో అధునాతన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉండ డంతో గుట్టచప్పుడు కాకుండా యువత ఆన్‌లైన్ ద్వారా పందెం కాస్తున్నారు. క్రికెట్ బుకీలను పరిచయం చేసుకుంటున్న యువ త వారి ప్రోత్సాహంతో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివారు డబ్బు దొరకనప్పుడు దొంగతనాలకు, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాల్లో ఎక్కువగా  బెట్టింగ్, మాదకద్రవ్యాలకు బానిస లుగా మారినవారు, ఆర్థిక నేరాలకు పాల్పడేవారు అధికంగా ఉండటం శోచనీయం.

క్రికెట్ బెట్టింగ్‌ను నడిపించే ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ సంబంధించి బుకీలతో పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని రహస్యంగా సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం బుకీలు ఒక కోడ్ భాషను వినియోగిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. బెట్టింగ్ రాయుళ్లు వాడే భాషలో ‘లెగ్’ అనే పదం కీలకమైంది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే అంత మొత్తం చెల్లించాలనేది దాని అంతరార్థం.

అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ‘ప్లేయింగ్’ అని, తక్కువ అవకాశాలున్న జట్టుపై పందెం కాసేందుకు ‘ఈటింగ్’ అనే పదాలను ఉపయోగిస్తారని సమాచారం. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నా ఈ బెట్టింగ్‌లు ఆగడం లేదు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

బెట్టింగ్‌తోపాటు మ్యాచ్ ఫిక్సింగ్ క్రీడలకు పెద్ద ముప్పుగా మారింది. ఆన్‌లైన్ జూదం ఆగమనం మ్యాచ్ ఫిక్సింగ్ ప్రమాదాన్ని మరింతగా పెంచింది. ప్రపంచ జూద పరిశ్రమ భారీ స్థాయి వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారింది. అలాగే పందెం రకాల పరిధి పెరిగింది. జూదం, ఫిక్సింగ్ కారణంగా అవినీతి కూడా పెరిగింది. స్పోర్ట్స్ బెట్టింగ్‌కు సంబంధించి ప్రతి దేశంలోనూ ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా భారతదేశంలో క్రీడలు బెట్టింగ్‌లు చట్టవిరుద్ధం.

మన దేశంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, టెక్నాలజీ యాక్ట్ 2000 కిందికి ఇలాంటి కేసుల్లో ఎక్కువ భాగం వస్తాయి. అంతేకాదు, పలు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం దేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. బెట్టింగ్ కంపెనీలు ఈ లొసుగులను ఉపయోగించుకుంటున్నాయి.

ఐపీ ఎల్ వల్ల బెట్టింగ్‌తోపాటు యువత చదువులు అటకెక్కడం, యువత పెడ ధోరణి పట్టడం, తప్పుడు మార్గాలను ఎంచుకోవడం లాంటి దుష్పరిణామాలను మనం చూస్తునే ఉన్నాం. కాబట్టి, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న ఐపీఎల్‌ను ప్రభుత్వం సత్వరమే నిషేధించాల్సిన అవసరం ఉంది.

 షేక్ బాబా, 

ప్రజాసైన్స్ వేదిక ప్రధాన కార్యదర్శి