13 June, 2026 | 1:06 AM

తగ్గుతున్న పంట రుణాలు

13-06-2026 12:02 AM
  • ఏటా బ్యాంకర్ల సమావేశంలో భారీగానే రుణ ప్రతిపాదనలు
  • మూలధన పెట్టుబడిలో పంట రుణాలు..10 శాతం ఇవ్వాలని ఆర్బీఐ నిబంధన 
  • రుణాలు విడుదలకు ఆసక్తి చూపని బ్యాంకులు 
  • ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు 
  • అధిక వడ్డీలతో తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): బ్యాంకులు రైతులకిచ్చే పంట రుణాలు ఏటే టా తగ్గిపోతున్నాయి. రాష్ట్ర బ్యాంకర్ల స్థాయి సమావేశంలో వ్యవసాయ రుణాలకు సంబంధించి కార్యాచరణ భారీగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చేసరికి పూర్తిగా అమలు కావడం లేదు. ఏటా వ్యవసాయంతో పాటు వ్యవసాయ యంత్రపరికరాలు, అనుబంధ రంగాలు, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు, విద్యా, హౌసింగ్ తదితర రంగాలకు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటాయి.

అయితే ప్రతి బ్యాంకు మూలధన పెట్టుబడిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, మార్కెటిం గ్‌కు సంబం ధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు 18 శాతం ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నది. పంట రుణాలు మాత్రమే 10 శాతం వరకు ఇవ్వాలి. అయితే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే బ్యాంకర్ల కమటీ సమావేశంలో బ్యాంకులు ఏటా ప్రతిపాదనలు సిద్ధంచేసినా పూర్తి లక్ష్యానికి చేరుకోవడం లేదు.

అదే వాణిజ్య అవసరాలు, పరిశ్రమల విషయంలో మాత్రం లక్ష్యానికి అను గుణంగా రుణాలు ఇస్తూ.. రైతుల విషయంలో మాత్రం ఆసక్తికనబర్చడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్ర భుత్వాలు కూడా బ్యాంకులపై పూర్తిగా ఒత్తిడి తీసుకురావడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో బ్యాంకులకు సూచనలు చేయడం తప్ప.. ఆ తర్వాత మానిటరింగ్ చేయడం లేదని, అం దువల్ల బ్యాంకులు కూడా రైతులకు రుణలు ఇచ్చేందుకు పూర్తిగా ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలున్నాయి. 

2023 లక్ష్యం 73 వేల కోట్లు.. విడుదల చేసింది 64 వేల కోట్లే

2023 ఆర్థిక సంవత్సరానికి వానాకాలం, యాసంగికి కలిపి మొత్తం రూ. 73,438.5 కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నా రూ. 64,940 కోట్లు మాత్రమే విడుదలచేశాయి. అంటే లక్ష్యాని కంటే రూ.8,398 కోట్లు కుదించారు. ఇక 2024 ఆర్థిక సంవత్సరంలోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.

రూ.90,795.2 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, రూ.73,104 కోట్లు మాత్రమే రుణాల కోసం బ్యాంకులు విడుదలచేశాయి. అంటే 2024 ఏకంగా రూ.17,691 కోట్లు తగ్గించాయి. గత ఆర్థిక సంవత్సరం 2025 రూ. 89,500 కోట్లకు రూ.75,486 కోట్లు విడుదల చేసి రూ.14,015 కోట్లు కుదించాయి. 2026 రూ.96,920 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నా ఈ ఏడాదన్నా పూర్తిస్థాయిలో విడుదల చేస్తాయా? గత విధానాన్నే అవలంభిస్తాయా? అనేది తేలాల్సి ఉంది.

ప్రైవేట్ వ్యాపారులే దిక్కు.. 

బ్యాంకులు పంట రుణాలను పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకు రుణాలకు వడ్డీ తక్కువగా ఉంటుంది. అదే వడ్డీ వ్యాపారస్తుల వద్ద ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. పంటలు సమృద్ధిగా, ఉత్పత్తి ఎక్కువగా వచ్చినా ధాన్యం అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడాల్సిన వస్తున్నది.

ఇక అకాల వర్షాలు వస్తే రైతు పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉండదు. పంట ధరలు తక్కువగా ఉండటం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల రైతుకు ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతున్నది. ఒక వేళ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసినా సకాలంలో పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి వస్తున్నది. దీంతో రైతులకు రెండు రకాలుగా నష్టం జరుగుతున్నది.

ప్రైవేట్ రుణాలను బ్యాంకు రుణాలుగా మార్చాలి

ప్రజల పొదుపు నుంచి బ్యాంకులకు మూలధనం ఏర్పడుతుంది. బ్యాంకులు ఆ డబ్బులు రుణాలుగా ఇచ్చి వడ్డీ ద్వారా లాభాలు పొందుతాయి. అందుకు సంపూర్ణ లక్ష్యాలు సాధించేలా బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశం ఇవ్వాలి. ఆర్బీఐ ఆదేశం ప్రకారం ప్రైవేట్ రుణాలను బ్యాంకు రుణాలుగా మార్చాలి.

దీంతో రైతుల ఆస్తుల జప్తు తగ్గుతాయి. రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు వ్యాపారంలో 18 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. అందులో పంట రుణాలు 10 శాతం ఉండాలి. కానీ, బ్యాంకులు ఏటా రుణాల విడుదలలో కోత పెడుతున్నాయి. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో రైతులు ప్రైవేట్ అప్పుల భారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రతి మూడు నెలలకోసారని నిర్వహించాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి.

 తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్

సంవత్సరాలవారీగా వ్యవసాయ రుణాల ప్రణాళిక (రూ.కోట్లలో..)

సంవత్సరం లక్ష్యం ఇచ్చింది లోటు (తక్కువ) 

2023       73,438.5  64,940           8,398

2024       90,795.2  73,104          17,691 

2025       89,500  75,486          14,015

2026       96,920      -                        -