నేరడ గ్రామంలో ఎమ్మెల్యే, మంత్రి దిష్టిబొమ్మ దహనం
చిట్యాల, ఆగస్టు 13: చిట్యాల మండలం నేరడ గ్రామంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ల దిష్టిబొమ్మలను బీజేపీ నాయకులు గురువారం దహనం చేశారు. నార్కట్పల్లి మండలంలో రోడ్డు విస్తరణ పనులు గత మూడు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం కూడా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ బీజేపీ నాయకులు శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి దీక్షను భగ్నం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీ నాయకులను భయపెట్టలేరని, రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, బిజెపి నాయకుల అరెస్టుకు నిరసనగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల దిష్టిబొమ్మ దహనం చేశామని పీక వెంకన్న ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి ఉన్న విష్ణు, మండల ఉపాధ్యక్షుడు నాగచారి, మండల కార్యదర్శి వరుకుప్పల నరసింహ, శక్తి కేంద్రం ఇన్చార్జి గోపాలకృష్ణ, వెంకటేశం, నరేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






