14 August, 2026 | 2:58 AM

మంత్రి వివేక్‌కు సీపీఎస్ సమస్యలపై వినతిపత్రం

14-08-2026 01:19 AM
  1. టీఎస్‌సీపీఎస్‌ఇయూ ప్రతినిధి బృందం
  2. క్యాబినెట్‌లో చర్చ, న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఇయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శ్యామ్ సుందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ఉదయం రాష్ట్రశక్తి, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, సీపీఎస్ రద్దు ఆవశ్యకతను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన రూ. 20,000 కోట్లు షేర్ మార్కెట్లో ఉన్నా, రిటైర్ అయిన వారికి కనీస పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5వేలకు పైగా రిటైర్మెంట్‌లు ఉన్నారని, సీపీఎస్ విధానం రద్దు వల్ల ప్రభుత్వానికి భారం కాదని మంత్రికి తెలిపారు.

ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సీపీఎస్ విధానంపై చర్చిస్తానని యూనియన్ నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.