రైతుల అభివృద్ధికి కృషి చేయాలి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
పీఏసీఎస్ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం
బెజ్జంకి, ఆగస్టు 14: రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు వారధిగా మారాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) లిమిటెడ్కు నూతనంగా నియమితులైన చైర్మన్ ఒగ్గు దామోదర్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అవసరమైన సేవలను అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలకవర్గం పనిచేయాలని సూచించారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ, రైతుల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలను పారదర్శకంగా అందిస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లలో చెట్టి రాజు, నూనె రాజేందర్, కట్ట స్వరూప్, అడకాని నర్సింగం, గంగాధర రామచంద్రం, కేడిక అపర్ణ, బైరు రాజేందర్, తుమ్మ సుధాకర్ రెడ్డి, మాశం శంకర్, లింగాల రామవ్వ, కొమ్మెర తిరుపతి, కుక్కల రాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, గూడెల్లి శ్రీకాంత్, కల్లెపల్లి సర్పంచ్ బిగుళ్ల నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు కత్తి రమేష్, జెల్ల ప్రభాకర్, రావుల నర్సయ్య, ఎలిగా సతీష్, పీఏసీఎస్ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.






