భవాని రూపంలో శివయ్య దర్శనం
వెంకటాపూర్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : శ్రావణమాసపు తొలి శుక్రవారం వేళ, రామప్పలో వెలసిన భక్తి వెలుగులేళ, అమ్మ భవాని మాత అలంకరణలో అందంగా కొలువైన రామలింగేశ్వరుడు.. పుష్పాల పరిమళం పరవశం చేస్తుంటే, మంగళ హారతుల వెలుగులు మెరుస్తుంటే, భక్తుల హృదయాల్లో భక్తి భావం పొంగగా స్వామివారి సన్నిధి శివమయమై నిలిచింది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా చారిత్రక రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారిని అమ్మ భవాని మాత అలంకరణలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
పుష్పాలతో అలంకరించిన స్వామివారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో రామప్ప ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో పూల పరిమళం.. శివయ్య దర్శనం.. భవాని అలంకారంలో రామప్ప ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.






