అర్హులందరికీ పథకాలు అందేలా కృషి చేయాలి
మేడ్చల్, మార్చి 12 (విజయక్రాంతి): సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించేలా అధికారుల సమన్వయంతో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వార్డ్ సభ్యులు కృషి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు.
గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నూతన మున్సిపల్ ఛైర్పర్సన్స్, కౌన్సిలర్లు, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ రెవిన్యూ విజయేందర్ రెడ్డి, డి ఆర్ ఓ చంద్రవతి, ట్రాఫిక్ ఏ సి పి వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరసింహులు యాదవ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టిఎ కమీషన్ సభ్యులు జైపాల్ రెడ్డి లు హాజరైనారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకురాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో 5 స్థాయిలలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా & రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో 10 థీమ్స్ గురించి కలెక్టర్ వివరించారు. కీలకమైన ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎంపిక, అర్హతలు పరిశీలించి అధికారులు క్లుప్తంగా వివరంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. 99 రోజులపాటు పది అంశాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ 2న గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి ఇందులో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యా, వైద్య, వ్యవసాయం, మహిళ యువత సంక్షేమం పర్యావరణం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై తమ తమ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రములపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పోలీస్, రవాణ, ట్రాఫిక్, ఆర్టీసి శాఖల తరపున డ్రగ్స్ నియంత్రణ, రహదారి భద్రత కార్యక్రమా లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యర్థ పదార్థాలను అడవులలో వేయకుండా అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, మొక్కలను విరివిగా నాటుతూ ప్రకృతిని కాపాడాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నూతనంగా ఎన్నికైన ఛైర్మన్లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.




