20 August, 2026 | 5:56 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

15-06-2024 12:46 AM

టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ చెప్పారు. శుక్రవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో జరిగిన ఎన్నికల్లో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ముజీబ్‌హుస్సేన్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఉద్యోగులకు కష్టం వస్తే అండగా ఉంటానని చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని ఉద్యోగులను కోరారు. భాగ్యనగర్ ఉద్యోగుల మెమోను డ్రాప్ చేసి, ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు పంచాలని, సీఎం వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఉద్యోగుల బదిలీల్లో  సీనియర్లకు అవకాశం ఇచ్చి గౌరవించాలని పేర్కొన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ముజీబ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని చెప్పారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన 140 మంది క్యాడర్ స్ట్రెంత్‌ను తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా పర్వతాలు, కార్యదర్శులుగా రాగి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్‌సింగ్, గూడ ప్రభాకర్, షఫీ అహ్మద్, కార్యవర్గ సభ్యురాలిగా గీతారాణి ఎన్నిక కాగా, వారికి రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ నియామక పత్రాలను అందజేశారు.