కేసీఆర్‌కు ప్రజల శాపం తగిలింది
మాజీ మంత్రి పుష్పలీల
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులు, రైతులతోపాటు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం వల్లే కేసీఆర్‌ను ఇంటికి పంపించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పుష్పలీల ఆరోపించారు. ప్రజల శాపం తగిలి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. శుక్రవారం ఆమె గాంధీభవన్‌లో పార్టీ నేతలు ఇందిరాశోభన్, లింగంయాదవ్ తదితరులతో కలిసి మాట్లాడుతూ.. లంచానికి నిదర్శనంగా కేసీఆర్ నిలిచారని, అందుకే లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు అయి జైలుకు వెళ్లారని పేర్కొన్నారు.
సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల పేద విద్యార్థులకు లాభం జరుగుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రైవేట్ పాఠశాలలు, ట్యూషన్ ద్వారా డబ్బులు మూటగట్టుకున్నారని విమర్శించారు. పేరెంట్స్ కమిటీ వేసి, మంచి టీచర్లను నియమించాక విద్యా విధానంపై సమీక్షించి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల విధానంపై మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉంటుదన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ పాదేళ్ల పాలనలో భూ కజ్జాలు, లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్‌లే జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ విమర్శించారు.
విద్యుత్ కొనుగోలు విషయంలోనూ అవినీతి జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలోనూ అక్రమాలు జరిగాయని ఇందిరాశోభన్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రధానమంత్రి అవాస్‌యోజన కింద రాష్ట్రానికి ఒక్క ఇల్లూ రాలేదని మండిపడ్డారు.






