08-08-2025 12:27:03 AM
కలెక్టరేట్ నుంచి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారంపై మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు 07, (విజయ క్రాంతి): ఆగస్టు 15 నాటికి రెవెన్యూ సదస్సుల క్రింద వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి గురువారం రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులు, ఎన్ని దరఖాస్తుల పరిశీలన జరిగింది, ఆగస్టు 15 నాటికి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి 75 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో సాదా బైనామా కు సంబంధించి ఉన్న 49 వేల దరఖాస్తులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు.
సాదా బైనామా మినహాయించి పెండింగ్ ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ దశలలో పురోగతిలో ఉన్న 655 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఏన్కూరు లో 40 ఇండ్లను లబ్ధిదారులు ఆక్రమించారని, దీనిపై నివేదిక అందించాలని తహసిల్దార్ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఇండిపెండెంట్ గా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు ఇందిరమ్మ ఇండ్ల తరహాలో లబ్దిదారుల ద్వారా పూర్తి చేయాలని, ఆసక్తి అర్హత గల లబ్ధిదారులను వారం రోజులలో ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు