08-08-2025 09:41:43 AM
ఓయూ కాలనీలో హైడ్రా కమిషనర్ పర్యటన
హైదరాబాద్: భారీ వర్షానికి నీట మునిగిన షేక్‌పేట, ఉస్మానియా కాలనీలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) పర్యటించారు. పైనుంచి భారీగా వచ్చిన వరద ఓయూ కాలనీలోని తనాషానగర్ డ్రీమ్ వ్యాలీ ప్రాంతాలను ముంచెత్తగా.. అక్కడ నీటిని తొలగించే పనులను పర్యవేక్షంచించారు. పైనుంచి వచ్చిన వరదను తరలించేందుకు చర్యలు తీసుకుంటూనే.. హెవీ మోటార్లను పెట్టి నీటిని తోడారు. అనంతరం మల్కం చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఒక్కసారిగా 12 సెంటీమీటర్లకు పైగా గచ్చిబౌలి, మణికొండ, ఓయూ కాలనీలో వర్షం కురవడంతో వరద ముంచెత్తింది.
ఓయూ కాలనీలో మొత్తం హైడ్రా డీఆర్ ఎఫ్, మెట్ టీమ్‌లను రంగంలోకి దించి.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా.. చూడడంతో పాటు వరద నీటిని తొలగించే పనులను ముమ్మరం చేశారు. అనంతరం గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు.. హైడ్రా(Hyderabad Disaster Response and Asset Protection Agency) ఆర్ ఎఫ్ వో జయప్రకాష్, డీఎఫ్‌వో యజ్ఞన నారాయణ తదితరులు అక్కడే ఉండి వరద నీటిని తొలగించే పనులను పర్యవేక్షించారు. గంట సమయం వర్షం పడితే.. వరద నీటి ముప్పు తప్పించడానికి రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చిందని రంగనాథ్ అన్నారు. భారీగా వచ్చిన వరద కిందకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ నుంచి పెద్దమోత్తంలో వచ్చిన వరదకు ఆటంకంగా మారిన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న పైపులలో పూడికను తొలగించడంతో పరిస్థితి మెరుగుపడింది. హైడ్రా బృందాలు వర్షానికి ముందు నుంచే అక్కడ ఉండి వాహన రాకపోకలకు ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు. వరద కూడా ఎక్కువ సమయం నిలకుండా.. మోకాలు లోతు నీరుచేరినా వెంటనే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. గురువారం కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారుల్లో మొత్తం 18 చెట్లు నేలకొరిగాయి. వెనువెంటనే హైడ్రా బృందాలు వాటిని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారు.
హైడ్రా -డీఆర్ఎఫ్ హెల్ప్‌లైన్:
040 29560521 | 9000113667 | 9154170992