ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుని వృద్ధుడి మృతి
సికింద్రాబాద్,మే27 (విజయ క్రాంతి): రహదారులపై అడ్డగోలుగా నిలిపే వాహనాలు ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. బోయిన్పల్లి మార్కెట్ ప్రధాన రహదారిపై వాహనాలు అస్తవ్యస్తంగా నిలిచిపోవడంతో, అత్యవసర స్థితిలో ఉన్న ఓ రోగికి సకాలంలో వైద్యం అందక అంబులెన్స్లోనే కన్నుమూశారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ నగర్కు చెందిన పోచయ్య అనే వృద్ధుడు హఠాత్తుగా గుండె సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి తక్షణమే అతడిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ను ఆశ్రయించారు.అయితే,అంబులెన్స్ బోయిన్పల్లి మార్కెట్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపైకి రాగానే అక్కడ వాహనాలు రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా పార్క్ చేసి ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైరన్ మోగుతున్నా, ముందుకు వెళ్లేందుకు కనీసం దారి లేకపోవడంతో ఆ అంబులెన్స్ దాదాపు గంటసేపు అక్కడే నిలిచిపోయింది.
సమయం గడుస్తున్న కొద్దీ పోచయ్య పరిస్థితి విషమించింది. చివరకు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోలేకపోవడంతో ఆయన అంబులెన్స్లోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రోడ్డుపై వాహనాల క్రమబద్ధీకరణ లేకపోవడం వల్లే తమ కళ్లెదుటే మనిషి ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణ ఘటనతో ఆగ్రహోదగ్రులైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున రాత్రి బోయిన్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ రోడ్డులో అత్యవసర వాహనాలకు సైతం దారి లేకుండా వాహనాలను ఇష్టారాజ్యంగా నిలపడంపై వారు తీవ్ర ఆవేదన, నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసు సిబ్బందితో పాటు బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వారిని సముదాయించి పంపించారు.






