ఉరివేసుకొని వృద్ధురాలి ఆత్మహత్య
మందమర్రి, మే 11 : మందమర్రి పట్టణంలోని మూడో జోన్ పరిధిలో ఓ వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మందమర్రికి చెందిన గసకంటి కాంతమ్మ(85) గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. కొడుకు గసకంటి శంకర్ భార్య వారం రోజుల కిందట పని మీద ఊరికి వెళ్లగా, శంకర్ కూడా రెండు రోజుల కింద పనిమీద బయటకు వెళ్లినట్లు సమాచారం.
ఇంట్లో శంకర్ కుమారుడు వెంకటేష్, కాంతమ్మ మాత్రమే ఉండగా, వెంకటేష్ ఆదివారం ఉదయం నానమ్మకు వంట చేసి తినమని చెప్పి స్నేహితుడి వివాహ కార్యక్రమానికి వెళ్లి రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో చున్నితో ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. నాలుగు రోజులుగా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య బాధల కారణంగా ఆమె సరిగా అన్నం తినకపోవడంతో పాటు తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






