ప్రభుత్వం పని చేస్తోందా?
- వైద్యురాలి అత్యాచారంపై హైకోర్టు ఆగ్రహం
- ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమే కారణమని మందలింపు
- మూకదాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని వ్యాఖ్య
కోల్‌కతా, ఆగస్టు 16: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన విధ్వంసంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యులకు భద్రత కల్పించే రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని కోర్టు ప్రశ్నించింది. దాడిని నిరోధించడంలో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యాన్ని కోర్టు గుర్తించి వైద్య సిబ్బంది నైతికతపై ప్రభావాన్ని ఎత్తి చూపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. వైద్యులకు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడంలో రాష్ట్ర సామర్థ్యాన్ని కోర్టు ప్రశ్నించింది.
ఇలాంటి ఘటనలు వైద్యుల్లో భయం, అనిశ్చితి వాతావరణాన్ని సృష్టిస్తాయని నొక్కి చెప్పింది. కాలేజీలో దాడిని నిరోధించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి చేసేందుకు వచ్చిన 7 వేల మంది కాలినడకన రాలేరని, ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విధమైన వ్యాఖ్యలను చేసింది.
దీదీ ర్యాలీ
కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలికి న్యాయం జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మూకదాడికి రామ్, బామ్ కారణమని దీదీ ఆరోపించారు. కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో దీదీ ఈ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అయితే, బెంగాల్ వ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ తీరుపై కలకత్తా హైకోర్టు సైతం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి ఉరిశిక్ష పడాలని కోరుతూ మమతా బెనర్జీ కూడా కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిందని, ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను విచారణ కోసం సీబీఐ పిలిపించింది. నిరసనల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఘోష్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగాగ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.




