15-02-2026 12:48:42 AM
అర్హత లేని వారు వేసే ఓట్లు చెల్లవు
ఎక్స్‌అఫిషియో ఓట్లపై ఎన్నికల కమిషన్ స్పష్టత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ (ఎస్‌ఈసీ) స్పష్టత ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మె ల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి అని తెలిపింది.
మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులని పేర్కొంది. హైకోర్టు తీర్పు మేరకు ఈసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనల ప్రకారం అర్హత లేని వారు వేసే ఓట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం 2019 ప్రకారం పక్కాగా నిబంధనల అమలు చేయాలని వారిని ఆదేశించింది.
దీంతో ఇకపై లోకల్ ఓటు ఉంటేనే మేయర్, చైర్మన్ ఎన్నికల్లో గెలుపు ఓటములను ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫామ్-11 నోటీసు తప్పనిసరి అని పేర్కొంది. సమావేశానికి కనీసం ఒక రోజు ముందుగానే సభ్యులకు నోటీసు అందజేయాలని సూచించింది. ఈనెల 16న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈనేపథ్యంలోనే ఆదివారం మధ్యా హ్నం 12:30 గంటలలోపు సభ్యులందరికీ ఫామ్-11 నోటీసులు అందాలని సూచించింది.