29 June, 2026 | 10:18 PM

ఐరన్ ఓర్ ధరలు పెంచిన ఎన్‌ఎండీసీ

29-05-2024 12:05 AM

ముంబై, మే 28: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరల్ని పెంచింది. లంప్ ఓర్ ధర టన్నుకు రూ.250, ఫైన్స్ ధర టన్నుకు రూ.350 చొప్పున పెంచుతున్నట్టు మంగళవారం ఎన్‌ఎండీసీ ప్రకటించింది. ఈ పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ పెంపుతో లంప్ ఓర్ ధర టన్ను రూ.6,450కి, ఫైన్స్ ధర టన్ను రూ.5,610కి చేరుతుంది.  ఏప్రిల్ 29న ధరలు పెంచిన ఎన్‌ఎండీసీ మళ్లీ నెలరోజులకే మరోదఫా పెంపును ప్రకటించడం గమనార్హం. ఉక్కు తయారీకి ముడి పదార్థం ఇనుప ఖనిజమే అయినందున, ఓర్ ధరలు పెరిగిన ప్రభావంతో ఉక్కు ధరలు సైతం అధికమవుతాయని అంచనా. దేశంలో 20 శాతం ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు ఎన్‌ఎండీసీయే సరఫరా చేస్తుంది. 

తగ్గిన లాభం

ఎన్‌ఎండీసీ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 38 శాతం క్షీణించి రూ. 1,415 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 2,276 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఎన్‌ఎండీసీ మొత్తం ఆదాయం రూ.5,842 కోట్ల నుంచి రూ. 6,908 కోట్లకు చేరింది. అయితే వ్యయాలు భారీగా రూ. 3,794 కోట్ల నుంచి రూ. 4,519 కోట్లకు పెరగడంతో లాభాలు తగ్గాయి.