13-02-2026 12:16:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మహానగర పాలక సంస్థ జీహె చ్‌ఎంసీ విభజన, కొత్త కార్పొరేషన్ల ఆవిర్భావం నేపథ్యంలో పాలనాపరమైన సందిగ్ధతకు తెరదించుతూ యంత్రాంగం కీలక కార్యాచరణను ప్రకటించింది. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ గురించి ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ గురువారం జరిగిన హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్ల ఉమ్మడి స్టాండింగ్ కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను వివరించారు. రానున్న ఆరు నెలల కాలంలో మూడు కార్పొరేషన్ల పరిధిలోని పెండింగ్ పనులు, విభజన సమస్యలను పూర్తిగా చక్కబెడతామని, వ్యవస్థ మొత్తం గాడిలో పడ్డాకే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
రూ.వెయ్యి కోట్ల నిధులు
మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పనులు ప్రారంభించేలా చూసేందుకు భారీ నిధులను కేటాయించారు. ఈ రెండు కార్పొరేషన్ల పరిధిలో తక్షణ అభివద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, రోజువారీ నిర్వహణ కోసం ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500కోట్ల చొప్పున, మొత్తంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు అవసరమైన తక్షణ సేవలను అందించనున్నారు.
ఆస్తుల విభజనకు టాస్క్‌ఫోర్స్
విభజన ప్రక్రియలో అత్యంత క్లిష్టమైన ఆస్తులు, అప్పుల పంపిణీని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు జయేష్ రంజన్ తెలిపారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఆర్థికపరమైన చిక్కుముడులను విప్పిన అనుభవ జ్ఞులైన నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు మూడు కార్పొరేషన్ల మధ్య ఆస్తులు, అప్పులను నిష్పక్షపాతంగా విభజించి, వీలైనంత త్వరగా నివేదికను సమర్పించనున్నారు.
ఈ నివేదిక ఆధారంగానే భవిష్య త్ ఆర్థిక లావాదేవీలు ఉండనున్నాయి. కార్పొరేషన్ల విభజనతో ఉద్యోగుల జీతభత్యాలపై నెలకొన్న ఆందోళనకు స్పెషల్ ఆఫీసర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు, అంటే వచ్చే మార్చి 31 వరకు మూడు కార్పొరేషన్ల ఉద్యోగుల జీతాలన్నీ యథావిధిగా జీహెచ్‌ఎంసీ నుంచే చెల్లించబడుతాయని స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవ త్సరం నుంచి ఆయా కార్పొరేషన్ల పరిధిలోకి ఉద్యోగుల కేటాయింపు, జీతాల చెల్లింపు ప్రక్రియ మారుతుందని సూచించారు.
అభివృద్ధి పనుల్లో వేగం
పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతున్నప్పటికీ, అభివృద్ధి పనులు ఆగిపోవని జయేష్ రంజన్ హామీ ఇచ్చారు. ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ కొనసాగుతాయని, హెచ్-సిటీ పనులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు. అలాగే రానున్న వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శానిటేషన్, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఆరు నెలల టార్గెట్.. సమస్యలకు చెక్
కార్పొరేషన్ల విభజన తర్వాత తలెత్తిన సాంకేతిక, పరిపాలనా పరమైన అంశాల ను పరిష్కరించేందుకు ఆరు నెలల గడువును ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ సమయంలోగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోజువారీ పాలనను మెరుగుపరచడం, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడం, విభజన ప్రక్రియను పూర్తి చేయడంపైనే యంత్రాంగం దష్టి సారించనుంది. ముందుగా ఉన్న పనులన్నింటినీ ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని జయేష్ రంజన్ స్పష్టం చేశారు.