13-02-2026 12:28:27 AM
రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు
విజయక్రాంతి, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల చట్టాలను కాపా డుకుందాం అంటూ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తం గా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, అసంఘటిత కార్మికులు వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ల వద్ద, రోడ్ల మీద భారీ ర్యాలీలు చేపట్టారు.
హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు నిర్వహించిన కార్మిక సంఘాల ర్యాలీ నిర్వహించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభవరకు వేలాది మంది కార్మికులు తరలివచ్చారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల లగా విభజించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు.
ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ అనేక సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులకు అన్యా యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అంబానీ ఆదానీ సంస్థలతో విదేశీ సంస్థలకు కార్మిక హక్కును తాకట్టు పెడుతున్నారని ఆన్నారు.
గతంలో రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకువస్తే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పోరా టాల చేసి వాటిని రద్దు చేయించే విధంగా కృషి చేశారని అన్నారు. అదే తరహాలో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంతవరకు కార్మిక సంఘాలు ఐక్యపోరాటాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిరంతరంగా పోరాటాలు చేయాలన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, బిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ, టీయూసీఐ రాష్ట్ర నాయకురాలు ఎస్‌ఎల్ పద్మ ఏఐకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సాగర్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ, సిఐటియు నగర అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ వాటర్ సెక్షన్ ఎదుట, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట, కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై హమాలీలు, గోదాముల ముందు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, ప్రభుత్వ ఆసుపత్రి కార్మిక నాయకులు శ్రీనివాస్, రఫిక్, సునీత, పద్మ, లావణ్య, అనిత, మమత, ప్రవీణ్, రజిత, బాల్రాజ్, సంగమేశ్వర్,
లక్ష్మి, కామారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, వాదుల రాజిరెడ్డి, రాజు, సత్తయ్య పాల్గొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల నేతలు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, కార్మికులు ధర్నా చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు.