ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి

23-04-2024 01:44:06 AM

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఉండొద్దు

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలి

డీజీపీ రవి గుప్తా ఆదేశాలు

భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి పోలీస్ అధికారులతో సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (విజయక్రాంతి):  ఏజెన్సీ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు ఉండొద్దని డీజీపీ ఆదేశించారు. సోమవారం ఆయన హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి భద్రాద్రి జిల్లా చేరకుని చర్ల మండలంలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి భద్రతా బలగాల బేస్ క్యాంప్‌లను సందర్శించారు. అనంతరం అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (గ్రేహౌండ్స్) విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారూసిన్హా , ఎస్‌ఐబీ ఐజీపీ సుమతితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశం లో డీజీపీ మాట్లాడారు.

మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ లోక్‌సభ ఎన్నికలను విజయవం తం చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం రవాణాను అడ్డుకోవాలన్నారు. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. అనంత రం మూడు జిల్లాల ఎస్పీలను వివిధ అంశాలపై ఆరా తీశారు. 

సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజ్, ములుగు ఎస్పీ డాక్ట ర్ శబరీష్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే, ఎస్‌ఐబీ ఎస్పీ రాజేష్, కొత్తగూడెం ఓఎస్డీ సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ జితే, ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, సీఆర్పీఎఫ్ అధికారులు ఆర్.కె పాండా, ఎం.కె మీనా, మోహన్, రితేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.