ఖమ్మం నుంచి పోటీకి రెడీ
l అధిష్ఠానం అదేశిస్తే సిద్ధమని ప్రకటన
l మహిళలను మోదీ అవమానిస్తున్నారు
l రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి
హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. ఖమ్మం జిల్లాను పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందని అన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధి భవానిరెడ్డి, కోట శ్రీనివాస్‌తో కలిసి సోమవారం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గ్యారెంటీలకు వారెంటీ అయిపోయిందని, ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని వ్యాఖ్యానించారు. ప్రధానిగా ఉన్న మోదీ హిందువులనూ ద్వేషిస్తున్నారని, దేశ మహిళలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మహిళల మంగళ సూత్రాలు తీసే దమ్ము ఎవరికీ లేదని ఆమె హెచ్చరించారు. మంగళసూత్రాలు ఇచ్చినా తీసుకునే ముస్లింలు ఎవరు లేరన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టెర్రరిజం, ద్వేషం ఒక మతానికి సంబంధించినది కాదన్నారు.
మతం పేరుతో రెచ్చగొట్టడం సరికాదు: జి.నిరంజన్
దేశ చరిత్రలో ఇంతగా దిగజారిన ప్రధాన మంత్రిని చూడలేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జీ నిరంజన్ అన్నారు. మొదటి దశ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో సోమవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఆరోపించిననట్లుగా దేశ సంపదను, మహిళల వద్ద ఉన్న బంగారాన్ని ఇతరులకు పంచుతామని ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పీఠికలో అన్ని వర్గాలు, మతాలకు సమాన అవకాశాలు కల్పించారని తెలిపారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే వారణాసిలో మోదీ నామినేషన్ వేయాలని నిరంజన్ డిమాండ్ చేశారు.






