విద్యుత్ ఛార్జీలు యథాతథం
- పెంచడం లేదని తేల్చిచెప్పిన ఈఆర్‌సీ
- 2026-27లో విద్యుత్తు కొనుగోలు, అమ్మకాల మధ్య రూ.15,105.91 కోట్ల తేడా
- ఉచిత విద్యుత్తుకు రూ.14 వేల కోట్ల సబ్సిడీ చెల్లించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఈ ఆర్థిక సంవత్సరం (2026 లోనూ ఎలాంటి విద్యుత్తు ఛార్జీలు పెంచవద్దని విద్యు త్తు నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీచేసిం ది. ఈ నెల 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు డిస్కంలు (ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్) ఏఆర్‌ఆర్ (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్) ప్రతిపాదనలను టీజీఈఆర్‌సీకి కొద్ది రోజుల క్రితమే సమర్పించాయి. రెండు డిస్కంలు కలిసి మొత్తం రూ.54,567 కోట్ల విద్యుత్తు కొనుగోళ్లు చేయాలని, దీనికి ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ ఛార్జీలను మొత్తంగా కలుపుకొని రూ. 72,996 కోట్లు అవుతుందని డిస్కంలు ప్రతిపాదించాయి.
దీనిని పరిశీలించిన ఈఆర్‌సీ రెండు డిస్కంలు (సెస్‌తో కలిపి) మొత్తం రూ.65,559.29 కోట్లు అవసరమని, విద్యుత్తు అమ్మకాల ద్వారా రూ.50,453.38 కోట్లు వస్తాయని, అంటే ఆదాయంలో లోటు రూ.15,105.91 కోట్లు అని తేల్చి చెప్పింది. ఆదాయంలో లోటు అయిన రూ.15,105.91 కోట్లలో ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు సబ్సిడీగా రూ.14 వేల కోట్లు ఇవ్వనుందని, మిగిలిన రూ.1,105.91 కోట్లకు అసెట్ అలొకేషన్ చేస్తున్నట్టుగా పేర్కొంది.
ఎక్స్‌గ్రేషియా 8 లక్షలకు పెంపు
విద్యుత్తు ప్రమాదాల వల్ల ప్రజలెవరైనా చనిపోతే ఇప్పటి వరకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతున్నట్టుగా ఈఆర్‌సీ ప్రకటించింది. ఇది కూడా ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.




