04-05-2025 01:01:56 AM
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీలో సుమారు వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ (ఈ- సిటీ)ని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం ఆయన తెలంగాణలో సంయుక్తంగా రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సిరా నెట్‌వర్క్స్ (తైవాన్), ఎల్సీజీసీ రెజల్యూట్ గ్రూప్ (తెలంగాణ) ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి పెట్టుబడి కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహకాలను వివరించారు. రెండు కంపెనీలు 10 ఎకరాల్లో నెలకొల్పనున్న పరిశ్రమ ద్వారా 2,500 మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.
పరిశ్రమలో 5జీ నెట్‌వర్క్స్, మల్టీ లేయర్ నెట్‌వర్కింగ్ సొల్యూషన్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులు తయారవుతాయని, పరిశ్రమ ద్వారా ఇండో తైవాన్ మధ్య సత్సం బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.
టైర్‌ఛా -2, టైర్ -3 నగరాలతో పాటు పలు పట్టణాల్లో పరిశ్రమల స్థాపనకు ఇతోధికంగా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. సమావే శంలో టీజీఐసీసీ సీఈవో మధుసూదన్, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, సిరా నెట్‌వర్క్స్ ప్రతినిధులు చుయాన్, జాయ్ భట్టాచార్య, డౌగియాస్, ఎల్సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులు రణ్వీందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ..
తెలంగాణలో త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అన్నిరకాల క్రీడల అభివృద్ధికి బాటలు వేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. అలాగే క్రీడాకారుల కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా అకాడమీలు నెలకొల్పుతామని ప్రక టించారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సలహాదారు కోసరాజు లక్ష్మణ్, మీడియా కో వెంకట రమణారెడ్డి శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.
మంత్రి వారికి ఈ మేరకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం లో బ్యాడ్మింటన్ క్రీడాకారులను మరింత ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బ్యాడ్మిం టన్ అసోసియేషన్ ఈవెంట్స్ అండ్ ప్రొటోకాల్ ప్రతినిధి యూవీఎన్ బాబు ఉన్నారు.