calender_icon.png 20 May, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపురూప యక్షగాన ప్రబంధకర్త ఎల్లూరి నరసింగ కవి

19-05-2025 12:00:00 AM

“శ్రీకాంతాకుచ కుంభయుగ్మ 

విలత్కాశ్మీర పంకాంకిత 

శ్రీవక్షోంచిత వక్షసమ్ భవహరమ్, 

కారుణ్య పాథోనిధిమ్ 

పాకారి ప్రముఖాఖిలామరసుతమ్

కంజాత పత్రేక్షణమ్ 

శ్రీమామిళ్ళపురీ నిశాంత 

మహిరాట్తల్పం నృసింహభజే”

..అన్న అద్భుతమైన సంస్కృత నృసింహ స్తుతి శ్లోకం ఎల్లూరి నరసింగ కవి రచించిన ‘చూతపురీ విలాసము’ అనే యక్షగాన ప్రబంధమునందలిది. ఇది కేవలం పద్యకావ్యం కాదు. తెలుగు సాహితీక్షేత్రంలోనున్న పలు ప్రక్రియల్లో ‘యక్షగాన’ ప్రక్రియ కూడా ఒకటి. తెలుగులో అనేక యక్షగాన రచనలు ఉన్నా యి.

తెలుగులో తొలి యక్షగానంగా సాహిత్య చరిత్రకారులు భావించే కందుకూరి రుద్రకవి రచించిన ‘ సుగ్రీవవిజయము’తో యక్షగాన ప్రబంధాలు అనేకం మన తెలుగు సాహిత్యం లో తెలుగు కవుల కలాల నుండి వెలువడ్డా యి. అటువంటి రచనయే ఈ ‘చూతపురీ విలాసము’ అనే యక్షగాన ప్రబంధము. 

ఎల్లూరి నరసింగ కవి తెలుగు సంస్కృత భాషల్లో గొప్ప పాండిత్యం కలిగిన వాడు. ప్రతిభావంతుడైన ఈ నరసింగ కవి కొల్లాపురం సమీపంలోని వెల్లూరి గ్రామ వాస్తవ్యు డు. వెల్లూరి నరసింగ కవి పేరే కాలక్రమంలో వ్యవహారంలో ‘ఎల్లూరి’గా మారి ఎల్లూరి నరసింగ కవిగా పిలువబడ్డాడు. పండిత వంశీ యుడైన నరసింగ కవి నాటి జటప్రోలు సం స్థానాధీశుని చేత ఘన గౌరవాలందుకున్న కవి. వెల్లూరు గ్రామం జటప్రోలు సంస్థానాధీశుల పూర్వనివాసమని చరిత్రకారులు తెలి పారు.

ఈయన అప్పయామత్యుని కుమారు డు. ఈ అప్పయామత్యుడు కూడా కవియే. ఈయన స్థానిక దైవమైన మల్లేశ్వరుని గురించి, అక్కడి మూలస్థానేశ్వరుని గురించి, 22 పాదాలున్న మేలుకొలుపు పాటలు రాసి న వాడు. నరసింగ కవి సోదరుడైన లక్ష్మీనరసయ్య కూడా ‘లక్ష్మీనృసింహ విలాసము’ అనే రచన చేశాడు. తండ్రి వైపు మాత్రమే గాక, తల్లివైపు ముత్తాత ప్రెగడరాజు చెన్నకృష్ణకవి ప్రసిద్ధుడైన సాహితీవేత్త.

అంతేగాక ఆయన నాటి గద్వాల పాలకుడైన ముష్టిపల్లి రామాభూపాలుని ఆస్థాన పండితుడు కావడం విశే షం. నరసింగ కవి పండిత కుటుంబానికి చెం దినవాడు కావడం కూడా ఆయనలోని సహ జ ప్రతిభకు వన్నె తెచ్చి ఉండవచ్చును. సహ జ ప్రతిభామూర్తియైన ఈ నరసింగ కవికి పురాణదీక్షాచార్యుల శిష్యరికం మరింత పాం డిత్యాన్ని, కవితా శక్తిని అందించింది. ఈయన సోదరులివురూ నాటి గద్వాల సంస్థానాధీశు ల గౌరవాలను అందుకున్న పండితులు.

ఇం తటి నేపథ్యం ఉన్న ఎల్లూరి నరసింగ కవి కేవ లం ఈ ‘చూతపురీ విలాసము’ అనే ప్రబంధ ము గాక ‘రాచ కన్యకా పరిణయము’ అనే అనే గొప్ప ప్రబంధాన్ని, భర్తృహరి సుభాషితాలను కూడా రచించాడు. ‘రసిక సంస్కృ తాంధ్ర కవితా ప్రతిభా కమనీయ ధీర కుంజ ర సముదాయ చిత్త జలజాతరవి’యైన ఈ నరసింగ కవి భర్తృహరి త్రిశతిని ‘వెల్లూరి వెం కట రమణా’ అనే మకుటంతో చక్కని శతకం వలె అనువదించాడు.

ఈ త్రిశతి 1931లో కాకినాడ ఆంధ్ర సాహిత్యపరిషత్తు వారు ప్రచురిం చిన ‘శతక సముచ్ఛయం’లో చోటుచేసుకుంది. ఇందులో నీతి శతకం 93 పద్యాలతోను, శృంగార శతకం 102 పద్యాలతోను, వైరాగ్య శతకం 94 పద్యాలతోను, రెండు ఆద్యంత పద్యాలతో కలిసి మొత్తం 291 పద్యాలు కనిపిస్తాయి. ‘చూతపురీ విలాస ము’నకు సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి.

సుప్రసి ద్ధ పరిశోధకులు, తెలుగు భాషా సేవకులు, నిత్య సాహితీయాత్రికులు కీ.శే.డాక్టర్ కపిలవాయి లింగ మూర్తి గారు పరిష్కరించి ప్రకటించిన ఈ కావ్యానికి సమకూర్చిన విలువైన పీఠికలో తెలిపిన అనేకవిశేషాలు ఈ  గ్రంథ ప్రాశస్త్యా న్ని, కవి ప్రతిభావ్యుత్పత్తులను తెలుపుతున్నాయి. గ్రంథం పేరైన ‘చూతపురీ విలాస ము’లోని ‘చూతము’ అనే పదం మామిళ్లపల్లికి సంస్కృతీకరణ.

ఈ గ్రామం వెలసిన నర సింహస్వామి  కవి ఇష్ట దైవం. కవికి మాత్రమే కాదు కావ్యరచనకు ప్రేరకుడైన నరసారాయుడికి కూడా ఇష్ట దైవమే. రచనలోని ముఖ్యదై వం నరసింహుడు కృతికర్త నరసింగ కవి, కృతి ప్రేరకుడు నరస రాయుడు. అంతా నరసింహమయం. ఈ నరసారాయుడు తరణికంటి వాడు. తరణికల్లు కల్వకుర్తి తాలూకా లోనిది. మామిళ్ళపల్లేమో అచ్చంపేట తాలూ కా సమీపంలోని గ్రామం. ఈ రచన ‘విరోధి’ నామ సంవత్సరంలో ఉన్నట్లు అంతర్గత సాక్ష్యాలున్నాయని డాక్టర్ లింగమూర్తి పేర్కొన్నారు. 

‘చూతపురీ విలాసము’లోని ప్రధాన కథ పన్నిద్దరాళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి అళ్వార్ అని పిలువబడే విప్రనారాయణుని కథ. విప్రనారాయణుని కథకు సంబంధించి న పద్య కావ్యాలు అప్పటికే తెలుగు సాహితీ ప్రపంచంలోకి వచ్చాయి. సారంగు తమ్మ య్య, చదలవాడ మల్లనలు ప్రత్యేక కావ్యాలే రచించారు. తాళ్లపాక చిన్న న్న పన్నిద్దరాళ్వారుల కథలను ప్రత్యేకంగా  ‘పరమయోగి విలాసము’ అనే ఒక ద్విపద కావ్యాన్ని రచించాడు.

నరసింగ కవి రచన కన్నా ముందే ఈ కావ్యాలు వెలుగు చూచిన కారణంగా వీటిని ఈ కథ విషయంలో అధికంగా సారంగు తమ్మయ్య రచనను అనునరించినట్లు గ్రంథ పీఠికతో డాక్టర్ కపిలవాయి వారు కొన్ని ఉదాహరణలతో వివరించారు. అయితే.. రంగనా థుని భక్తుడైన, కావ్యనాయకుడైన విప్రనారాయణ్ని ఈకవి తన స్వస్థానాభిమానం చేత నాయకుణ్ని చూతపురి నరసింహ భక్తునిగా కూడా పేర్కొనడం విశేషం. 

‘చూతపురీ విలాసము’లో పద్యాలు, దరువులు, ద్విపదలు ఉన్నాయి. కవికి కేవలం పద్యనిర్మాణం మాత్రమే గాక, దేశి సాహిత్యంతో ముఖ్యంగా జానపద కళా రూపాలపై కూడా అధికారం ఉన్నట్లు ఈ యక్షగాన ప్ర బంధం నిరూపిస్తున్నది . 183 పద్యాలే గాక, 639 ద్విపదలు, 102 దరువులతో కలిపి.. మొత్తం 924 ఉన్నాయి. పద్యాలు 9 విశేష వృత్తాలతో బాటు, సీస పద్యాలు, తేటగీతులు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా సీస పద్యాలపై బమ్మెర పోతన ప్రభావం బాగా కనిపిస్తుంది. దరువులన్నింటినీ ఏడు తాళాలు, ఇరవై నాలుగు రాగాల్లో కూర్చిన తీరు కవికి ఉన్న సంగీత పరిజ్ఞానానికి ప్రమాణంగా చెప్పవ చ్చు. ఇందులో ఆట తాళాలు, కల్యాణీ రాగా ల్లో ఎక్కువగా లాలి పాటలు, తలుపు దగ్గరి పాటలు, ఏలలు, ఓలలు కనిపిస్తాయి. ముగింపులో మంగళహారతులు కూడా కూర్చిన కవి నరసింగకవి. 

‘సరస సంగీత విచార కోవిదుల, భారత శాస్త్రజ్ఞుల ప్రౌఢిమ’ కలిగిన కవిస్తుతితో బాటు దైవస్తుతి పద్యాలు సంస్కృత వృత్తాల్లో ఉండ టం పరిశీలిస్తే కవి ఉభయ భాషాపాండిత్యం పాఠకులు గుర్తించగలరు. ఇందులోని కథ పాతదే అయినా సమయోచిత మార్పులు చేసే ప్రయత్నం చేశాడు నరసింగ కవి. ఇందులో లక్ష్మీదేవి, ఎఱుక సాని, దేవదేవి వంటి అనేక పాత్రలతోబాటు విప్రనా రాయణుని పూర్వజన్మ వృత్తాంతం కథా విస్తృతికి, దోహదం చేసింది. తరణికంటి ఆం జనేయస్వామి, మామిళ్ళపల్లి శ్యామలాదేవి, కొల్లాపురం లక్ష్మీదేవి స్తుతులు కూడా చోటు చేసుకోవడం ఈ కావ్యం విశేషం.

“బ్రహ్మ పూజిత రంగ పతితపావనరంగ

విమలాం తరంగ కావేటిరంగ

రాఘవార్చితరంగ రాకేందు ముఖరంగ 

నాపాలిరంగ మన్నారు రంగ 

కాంచనాంబర రంగ కరుణాంబునిధి రంగ 

సుందర రంగ కస్తూరి రంగ 

భువన మోహన రంగ పోషితామర రంగ 

వేదగోచర రంగ విమల రంగ 

అరిదారించిత కర రంగ వరదరంగ 

సంగరాహితమరభంగ శౌర్య రంగ

కాండ జాత భవాండ పిచండ రంగ

పురహస్తుత పాదపంకరుహరంగ”

...అంటూ రచించిన పద్యం నరసింగ కవి రచనా ప్రతిభ, పద్య నిర్మాణచణత్వము ఎంతటిదో తెలుస్తున్నది. దుందుభి నదికి ఈ క్షేత్రము కేవలం రెండు క్రోసుల దూరంలోనే ఉన్న కారణంగా ప్రాచీనులు దీనిని దుందుభి తీర్థ క్షేత్రమని వ్యవహరించే వారని తెలియుచున్నది. ఈ మామిళ్ళపల్లిని కవి చూతపురిగా వ్యవహరించడానికి ప్రధాన హేతువు ఇక్కడి శాసనాల్లో  ఈ గ్రామాన్ని ‘చూతఘోషపురము’గా, ‘చూతపోషపురము’గా పేర్కొనడమే కారణం కావచ్చునని కావ్యపీఠికలో డాక్టర్ లింగమూర్తి గారు అభిప్రాయపడ్డారు. 

కథ వైష్ణవ సంబంధమైనది గనుక ‘తిరుమంజనం’, ‘తిరు మాళిగ’, ‘పుళి’, ‘తిరుపణ్యా రం’ మొదలైన పరిభాషతో బాటు అనేక సామెతలు, జాతీయాలు విరివిగా ఈ కావ్యం లో పొందుపరచబడ్డాయి. ఎల్లూరి నరసింగ కవి రచనలో మరొక ప్రధానమైన కావ్యం ‘రాచకన్యకా పరిణయం’. కీ.శే డాక్టర్ తలమూడి పి బాలసుబ్బయ్య గారు ఈ కావ్యంపై పరిశోధన చేసి చేసి ఈ గ్రంథాన్ని పరిశోధించి తమ సిద్ధాంత వ్యాసంతో కలిపి ప్రచురించారు. ఈ గ్రంథా న్ని గురించి, దీనిలో కవి ప్రదర్శించిన తాత్విక దృష్టిని, దీని నామౌచిత్యాన్ని గురించి అనేక విశేషాలను ప్రత్యేక ప్రమాణాలతో కలిపి తమ రచనలో వివరించారు. కవి ప్రతి భా వైభవాన్ని వివరించే అనేక అంశాల్లో భాగంగా కవి అలంకార వైదూష్యాన్ని, కావ్యంలోని పద్యాలను ఉదాహరించే యత్నం చేశా రు డాక్టర్ బాలసుబ్బయ్య. 

‘భగవంతుడని యెఱుంగక 

జగతీసుతుడితనితోడ సలిపెను వైరం 

బెగియును గన్నుంగానక

తగరు బలసి కుండతోడ దాకిన లీలన్’ 

...అన్న పద్యమొక్కటి చాలు నరసింగ కవి అలంకారిక రచన ప్రతిభ అర్థమవుతున్నది. కావ్యంలోని ప్రతిపద్యమూ కవి ప్రతిభకు నిదర్శనంగా ‘రాచ కన్యకా పరిణయం’ ఒక విశిష్ఠి రచనగా పేర్కొనవచ్చు. ఈ కవి రచించిన మరో అందమైన రచన భర్తృహరి త్రిశతి. పద్యాలన్నీ కంద పద్యాలే అయినా అందంగా పొందుపరిచిన విధానం ప్రశంసనీయం.

‘ధర భర్తృహరి కృతంబై

బరగిన శ్లోకములు కంద పద్యంబులుగా

నరసింగ కవి రచించెను

నరదుగ వెల్లూరి వెంకటరమణా!’

..అన్న పద్యంతో ఈ రచన ప్రారంభమై కం దాల అందాల్లో భర్తృహరిని ఘనంగా ఆవిష్కరించిన ఉత్తమ కవియైన ఎల్లూరి నరసింగకవి కలకాలం స్మరించుకోదగిన కవిశ్రేష్ఠుడు-.