calender_icon.png 20 May, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెట్టి మాదిగ

19-05-2025 12:00:00 AM

పోలీసు పటేలగు రామిరెడ్డి గ్రామచావడిపై కూర్చొని యుండెను. అతడేదో తొందర పనిచేయ మనోవైకల్యము గలవానివలె గన్పట్టుచుండెను. రామిరెడ్డి గ్రామము నందు పలుకుబడిగల రెడ్డి కుటుంబమున జన్మించెను. ఈతనికి సుమారు రెండువందల ఎకరముల భూమిగలదు. దీని వలన సంవత్సరమునకు ఇంచుమించు ఐదారు వందల యాదాయము వచ్చు ను.

మన రెడ్డి గారికి తెనుగు నందును, ఉరుదూ భాషయందును కొంత జ్ఞాన ము కలదు. ఐనను వాక్పటిమలో నీతని సరిపోలు పోలీసు పటేండ్లు అరుదుగానుందురు. గ్రామము లో ఒకనితో నింకొకనికి కలహములు కలిగించుట యందతనికి పెట్టినది పేరు.

గ్రామములో రెడ్డిగారిని మనసారా దూషించనివారులేరని చెప్పిన తప్పు కాదు. ఐనను వీరికి జంకియో లేక వారితో నేదేని పని గలుగుననియో అందరును వీరిని గౌరవ భక్తులతో జూతురు. రెడ్డిగారితో కించిద్విరోధ మెవరికైన గలిగినా నతడు అచటినుండి వేరొక గ్రామమునకు లేచిపోవలసినదే.

లేనిచో నతడు కష్టనష్టములకు పాలగుట యేగాక కొద్ది దినములలోనే యేదేని నేరము క్రింద న్యాయస్థానమున కీడ్వబడి నేరారోపితుడై శిక్షకు పాత్రుడైన కావలయును. లేదా దండుగలపాలై అన్నమో రామచంద్రా యను సప్తాక్షరి మంత్రోపాసననైనను చేయవలయును. ఈ కారణము వలన నే చండశాసనుడగు రామిరెడ్డిగారంటే గ్రామ ప్రజలకు భయము.

రామిరెడ్డిగారి కత్యవసరమైన కార్యముపై మూడామడ దూరముపైనున్న యతని బంధువుని యింటికి యుత్తరము పంపవలసియుండెను. తలారిని యూరివంతు మాదిగను పిలుచుకొని వచ్చుట కై పంపెను. కాని తలారి రిక్త హస్తములతో వచ్చి వంతు మాదిగవాని కీరోజు ఆవశ్యక కార్యము కలుగుటచే రాజాలననెనని రెడ్డిగారితో నుడివెను. ఇది వినగానే రెడ్డిగారు తోకద్రోక్కిన కాలభుజంగములవలె క్రుద్ధుడై ఏమి! వంతు మాదిగకు ఆవశ్యకమైన పనిగలదా! నా పని ఎవ్వరు చేయుదురు.

నీ తాతనా లేక నీ ముత్తాతనా? నీకు బుద్ధి లేదు. తుచ్చుడగు మాదిగవానిని పిలుచుకొని రాక యింకను సిగ్గులేక నాతో చెప్పుచున్నావా? నీ కింతయైనను సత్తువా లేదా యను చు పాదమున నున్న చెప్పునూడదీసి తలారిని కోపమడుగువరకు మోది, ఐదు నిమిషములలో మాది గ వాడు రాకున్న నీప్రాణముల తీసెదనని బెదిరించెను. తలారియు పటేలుగారి ప్రతాప మెరుగువా డగుటచే కిక్కురుమనక మాదిగవాడ దారిబట్టెను.

పటేలుగారికి క్రోధముడుగక యిట్లు తిట్టనారంభించెను. ఏమి, మాదిగవాని కావశ్యక కార్యమా! ఇక్కడ సర్కారు పని నెవ్వరు చేతురని తలచెనో, నేడు రేప టి కాలమే మారినది. మాదిగలకు గూడ కన్నులు నెత్తికెక్కి క్రిందుమీదు కానరాకుండ నైనవి. రేపే వీరి పని పట్టించెదను. ఈసారి వీరి మాన్యమును జప్తు చేయించకున్న నేను రామిరెడ్డినే కాను. ఇప్పుడదేమి విచిత్ర కాలమో కాని సర్కారనిన అందరికి నిర్లక్ష్యమే కలిగినది.

పాపము వారినెందుకు కష్టపెట్టవలెనని దయదలచిన వారు నెత్తికెక్కి పోవుచున్నారు. అం దుకనే పెద్దలు చెప్పుతో నలుగ రాచవలయునని చెప్పిరి. వెట్టంటే వీరికి కష్టమట. వీరిని ఊళ్ళో ఉండనిచ్చిన దెందుకో -వీరికి రైతులతో బిచ్చము బలిపె ట్టించే దెందుకో -ఇంట్లో కూర్చొని దొరలవలె తినుటకు కాబోలు. ఇక నా ప్రతాపమును చూపింతును. వీరల కొంపలు నాశనము చేతును ఎవ్వరడ్డము వచ్చెదరో చూచెదను కాక.

కార్తీక మాసము. ఆరునెలలు కష్టపడి గింజలు పండించుకొని నాలుగు అయిదు నెలల వరకు కలి యో గంజియో త్రాగుదుమని యువ్విళ్ళూరుచు పండించిన ధాన్యపు కుప్పలను కొట్టుకొను సమయము. బొక్కెనలకు తొండములిచ్చి, వ్యవసాయమునకు కావల సిన యితర పరికరముల నొసగి మీదు మిక్కిలి భూకెమందుతో కలిసి రాత్రింబగళ్ళు పనిచేసిన వెట్టి ఫలితమిపుడే తేలగలదు ఆ దినమున మాదిగ మల్లడు వంతు పోవలసి యుండెను.

కాని నాడే అతడు వెట్టిచేసిన భూకామందు కుప్పలు కొట్టుచుండెను- అందుచే మల్లడు సంకటమున చిక్కెను. ఒకవేళ వెట్టిపనికి పోయినచో గవ్వ లాభముండక పోవుటయేగాక రావలసిన బిచ్చములో తచ్చగును-వెట్టి మానినచో పాషాణ హృదయుడగు పటేలు గారి క్రోధాగ్నికింధనము నగుదునను జంకు-ఇట్లు చింతించుచు పటేలు గారిని బ్రతిమాలుకొని నేటికింకొకరిని తోలుట కొప్పించుటకై పటేలుగారి సన్నిధానమునకు పోవుటకై ప్రయాణమయ్యెను. ఇంతలోనే తలారి కోపఘార్ణిత నయనములతో వచ్చి మల్లడిని తిట్టుచు కొట్టుచు పటేలుగారి కడ కీడ్చుకొని పోజొచ్చెను.

అధైర్యుడును, న్యాయశాస్త్రమననేమోనెరుగనట్టియు మనమల్లడు యెవరి ధైర్యము చూచుకొని తలారి నెదిరింపగలడు? పటేలుగారు యితనిని చూచుటయే తడవుగ చేతిలోని మల్లును సవరించుకొని మల్లడిపై బడెను. మల్లడేమైన మరల కొట్టగలడాయను ధైర్యము తో. నతడు చేతులు నెప్పి యెత్తువరకు మర్ధించెను. ఎంత కొట్టినను పాపము మల్లడు నోరైన యెత్తలేదు.

తుదకు మల్ల డు దెబ్బలకాగలేక స్పృహతప్పి పడిపోయెను. నెత్తిపైన బలమగు గాయము తగిలెను. నెత్తురు వరదలై ప్రవహింప దొడగెను. నెత్తురును కనులచూచినతోడనే పటేలుగారి కోపము శాంతించెను. అంత నాత డు తలారితో తన భృత్యులనిద్దరిని - బిలిపించి మల్లనిని యింటివద్ద విడిచి రమ్మనెను. వారును శవాకారముగా నున్న నాతనిని యింటికి కొని పోయిరి.

సుమారైదారు నెలల వరకును మల్లడు వ్యాధిపీడుతుడై కూర్చున్న చోటనుండి లేవలేనివాడై పడియుండెను. ఇన్ని దినములును తినతిండిలేక, కట్టబట్టలేక ఆలుబిడ్డలు కృశించి యుండిరి. ఇది యంతయు కనులార జూచుచుండెడి పటేలుగారొక కాని సహాయమైనను చేయలేదు. రామిరెడ్డి ఎంత కఠినాత్ముడో పాఠకులే గ్రహించవలెను -ఇట్టి పటేండ్లు దేశమునందింకెంతమంది గలరో యూహించుకొనుడు.

ప్రచురణ కాలం: 15.08.1932, 

‘భాగ్యనగర్ పత్రిక’ -

‘తెలంగాణ దళిత కథలు’ నుంచి.. 

‘సేకర్త’ సంగిశెట్టి శ్రీనివాస్ సౌజన్యంతో..