20-05-2025 01:34:55 AM
భవన నిర్మాణ సమయంలోనే అగ్నిమాపకశాఖ నుంచి యజమాని నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాల్సి ఉంటుంది. యాజమాని ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు అగ్నిమాపకశాఖ అధికారులు భవనాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనులు జరుగుతుంటే అగ్నిమాపకశాఖ అక్కడికక్కడే నిర్మాణాన్ని నిలిపివేయవచ్చు. పెద్ద దుకాణాల్లో ఎల్లప్పుడూ యాజమాన్యాలు అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి.
హైదరాబాద్ నడిబొడ్డు. చార్మినార్ అడ్డా. నిత్యం వేలాదిమంది తిరుగాడే ప్రాంతం. అక్కడే ఉంది గుల్జార్ హౌస్. భవనంలో చోటుచేసుకున్న షార్క్‌సర్క్యూట్ కారణంగా 17 మంది ప్రాణాలు ఆహుతయ్యాయి. మృతు ల్లో ఎనిమిది ముక్కుపచ్చలారని చిన్నారులే ఉండడం అత్యంత విషాదకరమైన విషయం. వారి కలలు, ఆశలు, జీవితాలు.. అన్నీ ఆ మంటల్లోనే కలిసిపోయాయి. ఆ దుర్ఘటన గురించి ఆలోచిస్తేనే కళ్లు చెమరుస్తాయి.
ఈ అగ్నిప్రమాదం వ్యవస్థాగత వైఫల్యాలకు, బాధ్యతారాహిత్యానికి, సమాజంలో పాతుకుపోయిన నిర్లక్ష్యపు ధోరణికి నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు మరణాల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూనే.. ఇప్పుడు సమాజం అగ్నిప్రమాదానికి దా రితీసిన పరిస్థితులను మానవీయ కోణం లో విశ్లేషిస్తూ, విమర్శనాత్మక దృష్టితో పరిశీలించాల్సి ఉంది. ప్రమాదంపై వార్తా పత్రికలు, న్యూస్ చానెళ్లు మంచి కవరేజీ ఇచ్చాయి.
వీడియోలు, ఫొటోలను చూస్తే మనకు ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే.. గుల్జార్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఒకేఒక ఇరుకైన ప్రవేశ ద్వారం ఉంది. భవనమంతటా దట్టమైన పొగలు వ్యాపిస్తున్న క్రమంలో అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది భవనంలోకి ప్రవేశించడం కష్టతరమైంది.
చివరకు గోడలు బద్దలు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒకవైపు అయితే.. మరోవైపు భవన నిర్మా ణ సమయంలో యజమానులు అగ్నిమాపకశాఖ నిబంధనలు పాటించి ఉంటే.. ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయేవి కావనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి
నిర్మాణ సమయంలోనే నిర్లక్ష్యం..
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. కేవలం ఒక ప్రమాదం కాదు, అనేక తప్పిదాల ప రంపర. నిజానికి ఆ భవనం అనుమతులు లేకుండా నిర్మించిన షాప్ కమ్ రెసిడెన్షియల్ సముదాయం. ఆ సముదాయం మధ్య నుంచే రాకపోకలు సాగించేందుకు మార్గం ఉండటం మరోవిచిత్రం.
భవనాన్ని పూర్తిగా పరిశీలించిన అగ్నిమాపక శాఖ, హైడ్రా అధికారులు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కనీసం ఫైర్ సిబ్బంది లోపలికి ప్రవేశించలేని విధంగా భవనం నిర్మాణం జరిగిందని గుర్తించారు. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే.. భవనం నిర్మించిన తీరు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. అక్కడ కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఆ ఉల్లంఘన, ఆ బాధ్యతారాహిత్యమే చివరకు 17 మంది ప్రాణాలను బలిపెట్టింది.
భవన యజమాని వ్యాపారం ముత్యాలు, అభరణా లకు సంబంధించింది. నిజానికి అంత విలువైన వస్తువులకు సంబంధించిన దుకాణమంటే భద్రతాపరమైన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకుని ఉండాలి. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే కనీసం ఎలా? అన్న ప్రశ్న కూడా నాడు యజమాని వేసుకోలేదు. ‘జుగాడ్ కి జిందగీ’ అనుకునేలా ఒక రకమైన తాత్కాలిక అవసరాలకు మనిషి లొంగిపోతున్నాడు. ఏదైతే అది అవుతుందిలే..
అని భావిస్తూ చట్టాలు, నిబంధనలను పట్టించుకోని పరిస్థితులు వచ్చేశాయి. ఏదో ఒక విధంగా నాలుగు డబ్బులు సంపాదించి, పని పూర్తి చేసుకోవాలనే ఆలోచన ఎంతో ప్రమాదకరం. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రభు త్వం సరిగా స్పందించలేదని మృతుల బం ధువులు చేసిన వ్యాఖ్యలు సరికావు. ప్రమా దం ఎప్పుడూ దురదృష్టకరమైనదే. కానీ, గుల్జార్ హౌస్ ప్రమాదం కేవలం దురదృష్టకరం కాదు.
ఇది మానవ తప్పిదాల ఫలి తం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వాలు పరిహారం ఇవ్వడం మం చిదే. కానీ.. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది? అనే విషయాన్ని తేల్చాలి. ఇకముందు అలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చూడాలి.
నిబంధనలు ఎలా ఉంటాయంటే..
భవన నిర్మాణ సమయంలోనే అగ్నిమాపకశాఖ నుంచి యజమాని నిరభ్యం తర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాల్సి ఉం టుంది. యజమాని ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు అగ్నిమాపకశాఖ అధికారులు భవనాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనులు జరుగుతుంటే అగ్నిమాపకశాఖ అక్కడికక్కడే నిర్మాణాన్ని నిలిపివేయవచ్చు.
పెద్ద దుకాణాల్లో ఎల్లప్పుడూ యాజమాన్యాలు అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ ప్ర మాదం నుంచి బయటపడేందుకు ప్రత్యేకంగా నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చే యాలి. గోడలపై అగ్నిప్రమాదం సంభవిస్తే ఏంచేయాలో.. సిబ్బందికి అవగాహన క ల్పించేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఈ నిబంధనలేవీ గుల్జార్ హౌస్ యజమాని పాటించిన దాఖలాలు కనిపించలేదు. హైదరాబాద్ మహానగరంలో ఏటికేడు వందలాదిగా ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. పుట్టగొడుగుల్లా భవన సముదాయాలు పుట్టుకొస్తున్నాయి. వాటి అనుమతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. అగ్నిమాపకశాఖ సూచించిన నిబంధనలను యజమానులతో కచ్చితంగా అమలు చేయించాలి. నగరంలో తరచుగా అగ్నిమాపకశాఖ భవనాలను తనిఖీ చేయాలి.
ఇరుకైన భవనాలు, ప్రవేశ ద్వారాలు ఉన్న భవనాలను గుర్తించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే జరిమానాలు విధించాలి. ప్రజల క్షేమం కోసం అవసరమైతే కూల్చివేయడానికి కూడా వెనుకాడకూడదు. గుల్జార్ హౌస్ విషాదం ఇప్పుడు ఆ గుణపాఠమే నేర్పాలి. మన కండ్లను తెరిపించాలి. ప్రజలు కూడా చట్టాలను గౌరవించాలి. బాధ్యతాయుతంగా నిబంధనలు పాటించి ఇండ్లు, భవనాలు కట్టుకోవాలి. లేదంటే.. ఇవాళ గుల్జార్ హౌస్.. రేపు ఇంకేమిటో?
వ్యాసకర్త సెల్‌నంబర్ 99121 78129