2 May, 2026 | 4:14 PM

ప్రమోషన్లలో ఎమోషన్లు!

26-06-2024 12:28 AM
  • ఉపాధ్యాయుల పదోన్నతుల్లో కొందరు నిర్వేదం
  • సీనియర్లకు అన్యాయం జరిగిందంటూ వాదనలు
  • ప్రాధాన్యత తగ్గిందంటూ పలువురు ఆవేదన
  • మొత్తంగా బదిలీలు, ప్రమోషన్లపై సంతోషం

కామారెడ్డి, జూన్ 25(విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. దీంతో పదోన్నతులతో పాటు బదిలీలకు మోక్షం లభించింది. కామారెడ్డి జిల్లాలో ఎస్‌జీటీ ప్రమోషన్లు 787 మంది పొందారు. అయితే, 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్‌జిటీ సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులలో ప్రాధాన్యం దక్కలేదని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. హిందీ, తెలుగు పండితులతో పాటు పీఈటీకుకు ప్రమోషన్లు రావడంతో జూనియర్‌ల కింద సీనియర్లు పనిచేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ప్రస్తుతం సీనియర్లను, జూనియర్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రమోషన్లు కల్పించడం వల్ల జూనియర్ల కింద సీనియర్లు పనిచేయాల్సిన అవసరం వస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు.

సీనియర్లకు అన్యాయం

బదిలీలు, ప్రమోషన్లు సబబుగానే ఉంది. సీనియర్ ఉపాధ్యాయులకు ప్రమోషన్ల లో ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండే.  2000 డీఎస్సీలో ఎంపికైన వారు అంతకు ముందు డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి పదోన్న తుల్లో ఒకే విధంగా ప్రాధాన్యత కల్పించారు. దీంతో సీనియర్లకు ప్రమోషన్లలో అన్యాయం జరిగింది.

 రాఘవరెడ్డి, తపాస్ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి

భాష పండితుల 20 ఏళ్ల కల నేరవేరింది

20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భాష పండితుల కల నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసిన ఫలితం కల్గలేదు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హమీని నేరవేర్చారు.

 అంబీర్ మనోహర్‌రావు, తెలుగు ఉపాధ్యాయుడు, ఉప్పల్‌వాయి, కామారెడ్డి