మరో జన్మలోనూ కుప్పం ముద్దుబిడ్డగానే
ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): మళ్మీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించారు. అక్కడి బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్ర బాబు ప్రసంగించారు. ‘నేను ఇక్కడకు వచ్చి నా రాకున్నా నన్ను ఆదరించారు. ఇప్పటివరకు 8 సార్లు గెలిపించారు. కుప్పం ప్రజ లందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’ అంటూ ఉద్విగ్నానికి లోనయ్యారు. కుప్పం వ్యవహారాల చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మండల పార్టీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు.
మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారని, ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నట్లు చెప్పారు. అహంకారంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వైఎస్సార్ పార్టీకి పట్టిన గతే పడుతుందని అన్నారు. నా రాజకీయాలకు కుప్పం నియోజక వర్గం ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పం ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు.
నియోజక వర్గంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కుప్పంలోని నాలుగు మండలాలను ఆదర్శపట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇంటికి రెండు ఆవులు ఇస్తే ఆ రోజు నన్ను ఎగతాళి చేశారు. కుప్పంలో ప్రస్తుతం 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. పాడి, కోళ్ల పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కుప్పం భవిష్యత్తులో రైల్వే జంక్షన్‌గా మారే అవకాశం ఉందని, వీ కోట, పలమనేరు, రోడ్దును నాలుగు లేన్లుగా మార్చాలని పేర్కొన్నారు. ఫోర్ లేన్ రోడ్దు వేస్తే గంటలోనే బెంగళూరు వెళ్లవచ్చని తెలిపారు.






