11-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఈ సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం తమకేమైనా తీపికబురు చెప్పకపోతుందానని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల్లో కనీసం ఏదైనా ప్రకటించకపోతుందానని కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూ స్తున్న పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. పెండింగ్ డీఏలు, ఈహెచ్‌ఎస్ స్కీం అమలు, పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
అ యితే ఈ సంక్రాంతికి ఈ హామీలకు సంబంధించి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ను చెప్తుందా? లేదా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆరు నెలలకోసారి డీఏ విడుదల చేస్తామని గతంలోనే హామీ ఇచ్చింది. ఉద్యోగుల జేఏసీ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో గతంలో రెండు డీఏలను ప్రకటిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డీఏను విడుదల చేసి మరోకటి ఆరు నెలల తర్వాత ఇస్తా మని గతేడాది డిసెంబర్‌కు గడువు విధించింది. అయితే జనవరి వచ్చినా ఇంత వర కూ ఆ డీఏ ప్రకటించలేదు.
పైగా ఈ ఏడాది జనవరితో కలుపుకుంటే కొత్తగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నట్లవుతుంది. ఇందులో కనీసం రెండు డీఏలను ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం గతంలో ప్రకటించిన డీఏను ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ స్కీం(ఉద్యోగుల హెల్త్ స్కీం)ను ప్రభు త్వం కొంతకాలంగా నాన్చుతూ వస్తోంది. ప్రస్తుతమున్న ఆరోగ్య కార్డులపై క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు అందడంలేదు.
అయితే ఉద్యోగులు, ప్రభుత్వం సమాన వాటాతో ఆరోగ్య కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై మంత్రివర్గ సబ్ కమిటీ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయినా ఇది మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమలు కావా ల్సిన పీఆర్సీ ఇంతవరకు అమలుకు నోచుకోవడంలేదు.
పీఆర్సీ నివేదిక రెడీ అయినా కూడా పీఆర్సీ కమిటీ నుంచి నివేదికను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ అది తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. గతేడాది అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీని నియమించి రెండేండ్లు పూర్తయి.. మూడో ఏడాది కూడా నడుస్తోంది.
అప్పట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని కోరు తూ కమిటీకి ప్రతిపాదించారు కూడా. ప్రభుత్వమేమో ఆర్థిక కోణంలో ఉద్యోగుల హామీలను చూస్తోంది. 1 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వా లన్నా దాదాపు నెలకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుంది.
సీఎం కూడా చెప్పడంతో...
శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఉద్యోగుల సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే అసెంబ్లీ సమావేశా ల అనంతరం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడతామనడంతో ఓపిక పట్టిన ఉద్యోగులు.. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏదై నా ప్రకటించకపోదానని ఆశగా ఎదురుచూస్తున్నారు.