23 June, 2026 | 1:37 AM

సన్న రకాల వరి సాగుకు ప్రోత్సాహం..

23-06-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22, (విజయక్రాంతి): ప్రస్తుత వానాకాలం సీజన్లో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందేందుకు, నాణ్యమైన విత్తనాలు , ఎరువులను అందుబాటులో ఉంచేందుకు జిల్లాలోని 43 రైతు వేదికల వద్ద మంగళవారం నుండి ఈ నెల 29వ తేదీ వరకు విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సన్న రకాల వరి విత్తనాలు అయిన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-1638 రకాల సాగు ద్వారా రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు బహిరంగ మార్కెట్లో మెరుగైన ధరలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు సన్న రకాల వరి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

విత్తన మేళా కార్యక్రమంలో భాగంగా పప్పుధాన్యాలు, కూరగాయల పంటలకు సంబంధించిన మేలు రకం విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ, యూరియా తదితర వ్యవసాయ ఉత్పాదకాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రైతు వేదికల వద్ద సహకార సంఘాలు, తెలంగాణ సీడ్స్ సంస్థ, గుర్తింపు పొందిన విత్తన విక్రయ డీలర్లు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందజేయనున్నట్లు తెలిపారు.

  అలాగే నానో యూరియా 2,165.5 లీటర్లు, నానో డీఏపీ 1,664 లీటర్లు, యూరియా 16,000 మెట్రిక్ టన్నులు జిల్లాలో సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.జిల్లాలోని రైతులందరూ తమ సమీప రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని కోరారు.